అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌పై గుంటూరు జిల్లా కలెక్టర్, గనుల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డికి కంప్లయింట్ చేసినా అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వెళ్లిపోయారని న్యాయవాది నాగరాజు హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు వైసీపీ కార్యకర్తలపై ఆ పార్టీ ఎమ్మెల్యేపై కేసు దాఖలు చేస్తే దాన్ని ప్రజాప్రయోజనాల వ్యాఖ్యంగా ఎలా స్వీకరించాలని వ్యాఖ్యానిస్తూనే, అంబటి రాంబాబు అక్రమాలపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.
అసలేం జరిగింది?
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి, కొండమోడు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున నాణ్యమైన సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇక్కడ అక్రమాలు మాత్రం ఆగడం లేదు. ఈ గనుల నుంచి స్థానిక ఎమ్మెల్యేలు ఏటా రూ.200 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా యరపతినేని గనుల అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. అంతవరకు బాగానే ఉంది.
అయితే అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కూడా అదే తంతు కొనసాగిస్తున్నారు. స్థానిక రాజుపాలెం నేతలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన మనుషులను పెట్టుకుని గనుల అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీంతో సంవత్సరకాలంలో రగిలిపోతున్న రాజుపాలెం మండల నాయకులు, వైసీపీ కార్యకర్తలతో కేసు వేయించారని సమాచారం.
అంబటి లీలలు పెద్దలకు తెలియవా?
అంబటి రాంబాబు చేస్తున్న అక్రమ మైనింగ్ వైసీపీ అధిష్టానానికి తెలియదా? అనే ప్రశ్న ఎదురవుతోంది. మొదటి దఫా మంత్రి వర్గంలో అంబటికి చోటు కల్పించలేకపోయినందుకు గిఫ్ట్ గానే రాంబాబుకు మైనింగ్ అప్పగించారని టాక్. దానికి తగ్గట్టుగానే గనుల శాఖ ఉన్నత అధికారులు తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. వైసీపీ పెద్దల అనుమతి లేకుండా రోజూ 200 లారీల్లో సున్నపురాయి మిల్లులకు తరలించడం సాధ్యం కాదని రాజుపాలెం వైసీపీ నేతలకు అర్థం అయింది. అందుకే వారు కోర్టులను ఆశ్రయించారు.
రాంబాబుపై చర్యలు ఉంటాయా?
వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతుంటే ఇక అంబటి రాంబాబుపై చర్యలు ఆశించడం అత్యాశే. అయితే పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఇప్పటికే రాజుపాలెం మండల వైసీపీ నేతలు, కార్యకర్తలకు నచ్చజెబుతున్నారని కూడా సమాచారం ఉంది. రాజుపాలెం మండల వైసీపీ నేతలను బుధవారం రాత్రి వెంటనే గుంటూరు రావాల్సిందిగా సమాచారం అందించారట. పైస్థాయి నాయకులు బుజ్జగింపు ఫలిస్తే.. కేసు వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. కేసును ఉపసంహరించుకోవడం లేదా, దాన్ని నీరుకార్చడం చేస్తారని సమాచారం. గట్టిగా గళం వినిపించే టీడీపీ నేత యరపతినేనిపై ఇప్పటికే సీబీఐ కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆ పార్టీ మౌనంగా ఉంది.