మాజీ మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి అంత్యక్రియలు గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. అధికారిక లాంఛనాలతో నాయినికి అంతిమ వీడ్కోలు పలికారు. తమ ప్రియతమ నేతకు కడసారి చూసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొని నాయిని పాడే మోశారు. అంత్యక్రియలకు ముఖ్య నేతలందరూ హాజరకావడంతో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
అయినా కానీ, నాయిని నర్సింహ్మారెడ్డి అంత్యక్రియల్లో జేబుదొంగలు రెచ్చిపోయారు. రాజకీయ నాయకులే లక్ష్యంగా చెలరేగిపోయారు. అంత్యక్రియలకు హాజరైన పలువురి రాజకీయ నేతల మనీ పర్సులను కొట్టేసినట్లు తెలిసింది. పలువురు తమ జేబులు చూసుకుని లబోదిబోమన్నారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంకా మరికొందరు జేబు దొంగలు కూడా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.