జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు 2021, ఫిబ్రవరి10 న ముగియనుండగా ఈ లోపే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి గడువులోగా ఎన్నికలు జరగనున్నాయి. 1969 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఎన్నికలు జరగ్గా అన్నిపదవీకాలం ముగిసిన రెండేళ్ల నుంచి 12 ఏళ్ల తర్వాతే జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగురవేసేందుకు అధికార టీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టగా ఎలాగైనా తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్ లు వ్యూహాలు రచిస్తున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ మజ్లిస్ తో కలిసి పోటీ చేసి మొత్తం 150 స్థానాల్లో 143 కైవసం చేసుకోగా బీజేపీకి4, కాగ్రెస్ కు 2, టీడీపీకి 1 మాత్రమే వచ్చాయి.
డివిజన్లు యథాతథం
ఈసారి కూడ గతంలో వలే 150 డివిజన్లలోనే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం దాదాపు 75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డివిజన్ల పునర్విభజన చేసి సంఖ్యను పెంచాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కోరినప్పటికీ సమాయానుభావం వలన అలా సాధ్యం కాదని అధికారులు తేల్చారు. గత ఎన్నికల్లో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్న నలుగురు అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచినా తమ పదవులకు అనర్హులయ్యారు. దీంతో చట్ట సవరణ చేసి ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నవారికి కూడ ఈ సారి అవకాశం కల్పిస్తున్నారు. 2016 ఎన్నికల్లో పోటీ చేసిన 1333 మందిలో సరైన సమయంలో ఖర్చుల లెక్కలు సమర్పించని 117 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. వీరిలో చాలా మంది స్వతంత్ర అభ్యర్థులే.
బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్
బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకు బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. కోవిడ్-19 పాండమిక్ నేపథ్యంలో బీహార్ మోడల్ లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తమ పార్టీ పాలసీ మేరకు ఈవిఎంలతో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ కోరినప్పటికీ కరోనా ఉన్నందున అలా సాధ్యం కాదని ఎస్ఈసీ చెప్పారు.
పార్టీల వ్యూహాలు
ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి తమ తమ డివిజన్లలో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా తామ చేసిన రోడ్ల పనులు, టాయిలెట్ల, పార్కుల పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇటీవల వరద బాధిత ప్రాంతాల్లో కూడ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యటించి బాధితులను ఓదార్చారు. నష్టపరిహారం కూడ జాప్యం లేకుండా పంపిణీ చేశారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలకుల అసమర్థ పాలన వలనే ఇన్ని కాలనీలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శిస్తున్నాయి. వరద బాధితుల కష్టాలనే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తున్నాయి. మరి ఓటర్లు పట్టం కట్టేదెవరికో వేచి చూడాల్సిందే.











