తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయిన ఘటనలో ప్రభుత్వాన్ని మీడియా ద్వారా నిలదీసిన కరోనా పేషెండ్ హేమవతిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.రుయాలో హేమవతి కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.అయినా పోలీసులు కరోనా వార్డులో ప్రవేశించి,ఆమెను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. హేమవతి అరెస్టును తెలసుకున్న మీడియా సిబ్బంది మొత్తం స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు కంగారు పడి, ఆమెను వెంటనే రుయా ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లిపోయారు.
ఎందుకు అరెస్టు చేశారంటే?
రుయాలో ఆక్సిజన్ అందక 11మంది చనిపోయిన ఘటన సమయంలో హేమవతి,ఆమె తల్లి కూడా వైద్యం పొందుతున్నారు.గంట పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి దాదాపు 56 మంది చనిపోయారని ఆమె స్పష్టంగా చెప్పారు.ఆక్సిజన్ లేక ఏ వార్డులో ఎంత మంది చనిపోయారో హేమవతి మీడియాకు వెల్లడించారు.ప్రభుత్వ వైఫల్యాన్ని ఆమె మీడియా ద్వారా ఎండగట్టారు.దీంతో ప్రభుత్వ పరువు పోయినట్టయింది.ఆక్సిజన్ అయిపోయిన సమయంలో ఒక్క సీనియర్ డాక్టరు కూడా అందుబాటులో లేరని,నర్సులు కూడా పరారయ్యారని ఆమె మీడియాకు తెలిపారు.ఒకే ఒక్క జూనియర్ డాక్టర్ మాత్రం ప్రాణాలకు తెగించి చివరి వరకు వైద్యం అందించారని ఆమె మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ పనితీరును ఎండగట్టినందుకు ఇవాళ పోలీసులు తనను అరెస్టు చేశారని హేమవతి మండిపడుతున్నారు.











