నేటి రోజుల్లో అన్ని వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్న తరుణంలో… ఏ వస్తువైనా పండించేస్తే సరి కాసుల వర్షం కురిపించేస్తుందనుకున్నారు మన విశాఖ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు. అంతే అనుకున్నదే తడవుగా వారి ఆలోచనలకు శ్రీకారం చుట్టేశారు. వారు పండించిన పంటను కిలోకు రూ.వెయ్యి చొప్పున దాదాపు నాలుగు రాష్ట్రాలకు సరఫరా చేసేస్తూ లాభాలు గడించేస్తున్నారు.
ఇంతకీ ఆ పంట ఏంటంటే..?
ఇంతకీ కిలో రూ. వెయ్యికి అమ్ముతున్న పంట ఏంటో తెలుసా..? ‘గంజాయి’.దాదాపు వందల ఎకరాల్లో ఈ పంటను పండించేసి మంచి లాభాలు సాధించేస్తున్నారు వందల మంది.. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జూన్ నుంచి జనవరి వరకూ గంజాయి సాగు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
పండిన పంటను ఒడిస్సా, తమిళనాడు, కర్నాటకలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని జిల్లాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి విక్రయిస్తున్న 8 మందిని కడప జిల్లా రాజంపేట డివిజన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి సుమారు రూ. కోటి విలువైన 52 కేజీల గంజాయి, 7 సెల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్ మీడియాకి తెలిపారు.











