రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ‘పరువు హత్య’ కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటలు గడవక ముందే ఈ కేసును ఛేదించడం గమనార్హం. గచ్చిబౌలిలో కిడ్నాప్ చేసిన హేమంత్ అనే వ్యక్తిని గత రాత్రి సంగారెడ్డిలో హత్య చేసి పొదలలో విసిరివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఈ కేసు వివరాలను వెల్లడించారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనిలో నివాసం ఉంటున్న హేమంత్ ను కిడ్నాప్ చేసి హత్య చేశారని తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన 14 మందిని గుర్తించి అరెస్ట్ చేశామని వెల్లడించారు. తార నగర్ కు చెందిన లక్ష్మణ్ కూతురు అవంతి అదే ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రేమించుకున్నారని అన్నారు.
నాలుగు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు జూన్ లో కుత్బుళ్ల పూర్ సబ్ రిజిస్టర్ లో పెళ్లి చేసుకున్నారు… ఈ సమయంలో వీరి తల్లి తండ్రులు మిస్సింగ్ కేస్ చందనగర్ లో ఫిర్యాదు చేశారని చెప్పారు. పెళ్లి అనంతరం పెద్దల సమక్షం లో కౌన్సిలింగ్ ఇవ్వడం తో హేమంత్, అవంతి లు వేరుగా ఉంటామని స్పష్టం చేసినట్లు డీసీపీ తెలిపారు. తమకు నచ్చని పెళ్లి చేసుకున్నందుకు ఆమె తండ్రి, మేనమామ హేమంత్ పై కోపం పెంచుకున్నారని అన్నారు. దీంతో వీరిద్దరూ హేమంత్ ను హత్య చేయడానికి ప్లాన్ చేశారని అసలు విషయాన్ని బయటపెట్టారు. వటీనాగులపల్లి బిచ్చు యాదవ్, ఎరుకల కృష్ణ, లడ్డు అలియాస్ పాషాలనే కిరాయి హాంతకులతో 10 లక్షల సుఫారి ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారని వెల్లడించారు. ఆ కిరాయి హాంతకులు రెక్కీ నిర్వహిచి ప్లాన్ ప్రకారం హత్య చేశారని తెలిపారు.
అడ్వాన్సు లో భాగంగా వీరు లక్ష రూపాయలు అడ్వాన్సు ఇచ్చినట్లు తమ విచారణలో తేలినట్లు డీసీపీ స్పష్టం చేశారు. అవంతి అమ్మకు తప్ప ఈ విషయం ఇంట్లో వారికి ఎవరికీ తెలియదని చెప్పారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం లేదని తెలిపిన డీసీపీ 3:50 కి సమాచారం అందితే స్పాట్ లో 4:00 గంటలకు ఉన్నామని కుండబద్దలు కొట్టారు. యుగెందర్ రెడ్డి తన కారులో హేమంత్ ని బలవంతంగా ఎక్కించుకొని..ఓ ఆర్ ఆర్ మీదుగా జహీరాబాద్ కు వెళ్లారని అక్కడ మధ్యం,సుత్తి, తాడు కోనుగోలు చేశారని వివరించారు. హేమంత్ ను హత్య చేసిన తరువాత ఎల్లమ్మ గుడి దగ్గర మళ్ళీ ఆల్కహాల్ సేవించారని తెలిపారు. మధ్యం సేవించిన సమయంలో సంతోష్ రెడ్డి కి యుగెందర్ రెడ్డి ఫోన్ చేసారని అప్పటికే సంతోష్ రెడ్డి మా కస్టడీలో ఉండడంతో మాకు ఈ కేసు చేదించడం ఈజీ అయిందని వివరాలను వెల్లడించారు. మర్డర్ చేసిన వారిని..సహకరించిన వారిని అరెస్టు చేశామని అన్ని రకాల ఎవిడెన్స్ ఈ కేసు లో సేకరించామని తెలిపారు.











