(తిరుపతి, విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధులు)
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.. నెల్లూరు కుర్రాడిగానే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన జీవితంలో అటు రాయలసీమతో, ఇటు ఉత్తరాంధ్రతో కూడా మమేకం అయిపోయిన అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన హైస్కూలు విద్యాభ్యాసం సాగింది. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో చదివారు. శైవుడైన బాలసుబ్రమణ్యానికి శ్రీకాళహస్తీశ్వరుడంటే అమితమైన భక్తి. చిన్నతనంలో దాదాపుగా ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి.. ముక్కంటిని దర్శించుకునేవారు. ఆ తర్వాతి రోజుల్లో కూడా శ్రీకాళహస్తికి వచ్చిన ప్రతిసారీ దైవదర్శనం చేసుకునేవారు.
చిత్తూరు జిల్లాతో అనుబంధం
మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుటుంబానికి చిత్తూరు జిల్లాతో విడదీయరాని సంబంధం ఉంది. ఆయన తల్లి శకుంతలమ్మ జిల్లాలోని నగరి ప్రాంతానికి చెందిన వారు. ఆయన తండ్రి సాంబమూర్తి శ్రీకాళహస్తిలో సంస్కృత విద్యాభ్యాసం చేశారు. తర్వాత హరి కథకుడుగా నెల్లూరులో స్థిరపడ్డారు.
శ్రీకాళహస్తి, తిరుపతిలో చిన్ననాటి చదువు..
చిన్నతనంలో బాలసుబ్రమణ్యం అమ్మమ్మ ఇంటికి వస్తుండేవారు. అంతేకాక శ్రీకాళహస్తిలో కొంతకాలం విద్యాభ్యాసం చేశారు. శ్రీకాళహస్తిలోని రాజా పానుగంటి బంగారమ్మ సీతారామయ్య పాఠశాలలో చదువుతున్నప్పుడే తొలిసారిగా తన గొంతును టేప్ రికార్డర్లో రికార్డు చేయగా విన్నానని ఆయన ఓ సందర్భంలో చెప్పుకున్నారు. అప్పట్లో అక్కడ డ్రాయింగ్ మాస్టరుగా ఉన్న గురప్ప పిళ్లె తన గురువు అని, తనతో హరికథతు చెప్పిస్తూ తీర్చిదిద్దారని బాలు తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటారు. తర్వాత తిరుపతిలోని s v ఆర్ట్స్ కాలేజీలో puc చదివారు. గాయకునిగా ఎదిగిన తర్వాత తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాల్లో కచేరీలు నిర్వహించారు. శ్రీవారి సన్నిధి తిరుమలలో ఆలయం ఎదుట భక్తి సంగీత కచేరి నిర్వహించడం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!
సింహాద్రినాధుని సాక్షిగా మూడు ముళ్ళు..
గానగంధర్వుడి వైవాహిక జీవితం విశాఖ నుంచే ముడిపడింది. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి ది ప్రేమ వివాహం. వీరి పెళ్లికి పెద్దలు కాదన్నా… లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఈ జంట ఒకటైంది. 1969 సెప్టెంబర్ 5న సింహాచలం దేవస్థానానికి చెందిన పుష్కరిణి సత్రం లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఎస్పీ బాలు కి సింహాద్రి నాథుడు అంటే అమితమైన భక్తి. విశాఖ వచ్చిన ప్రతిసారి స్వామి దర్శనం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నించేవారు.
నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఉన్న మిత్రులంతా కలిసి ఘనంగానే వివాహం జరిపించారు. పెళ్లి అయితే రాత మారుతుంది అంటారు.. అది మంచిగా కావచ్చు చెడుగా కూడా కావచ్చు.. కానీ బాలు విషయంలో మాత్రం వివాహానంతర ప్రస్థానం అంతా విజయపథంలోనే సాగింది. అదేవిధంగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం విశాఖ వచ్చినప్పుడు భీమిలి సమీపంలో ఉన్న శివానందమూర్తి ఆశ్రమంలోను కొంత సమయం గడిపేందుకు ఆసక్తి చూపేవారు.
ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లెక్కలేనన్ని సార్లు ఆయన విశాఖలో తన గాత్రంతో ప్రజలను మంత్రముగ్ధులను చేసే వారు. బాలు నిర్మాతగా వ్యవహరించిన.. శుభసంకల్పం చిత్రం షూటింగ్ కూడా ఎక్కువ భాగం విశాఖలోనే జరిగింది. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పుట్టినా.. మరెక్కడ పెరిగినా.. ఆయనను ఒక విశాఖవాసి గా చూసేంత అనుబంధం ప్రజలతో ఆయనకు ఉంది. భౌతికంగా దూరమైనా ఆయన గొంతు ప్రతి ఒక్కరి మదినిండా నిండి ఉంటుంది.











