అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను మేజర్లుగా పరిగణించి విచారించేందుకు పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతి కోరారు.ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ధ్రువీకరించారు. పోలీసుల విజ్ఞప్తిని బోర్డు అనుమతిస్తుందా? లేదా? అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. బోర్డు కనుక నిందితులైన మైనర్లను విచారించేందుకు అనుమతిస్తే ఈ కేసులో రహస్యంగా మిగిలిపోయిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మైనర్ల మానసిక స్థితి, నేర స్వభావం, నేరం చేయగలిగే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జువైనల్ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక్కరు మినహా మిగతా ఐదుగురు మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు. మేజర్ అయిన నిందితుడు సాదుద్దీన్ ను చంచల్‌గూడ జైలుకు తరలించగా, మిగిలిన వారిని జువైనల్ హోంకు తరలించారు. మైనర్లు ఇప్పటికే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు జువైనల్ బోర్డును కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉంటే చంచల గూడా జైలులో ఉన్న సాదుద్దీన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల గూడా జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సాదుద్దెన ను బంజారా హీల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.నిందితుడి ప్రొఫైల్ పరిశీలించడంతో పాటు మైనర్ లతో పరిచయం పై పోలీసులు నిందితుడిని ప్రశ్నించనున్నట్లు సమాచారం. మే 28ణ పబ్ లో అసలు ఏం జరిగినది ? బాలికను ఎలా ట్రాప్ చేశారు ? బెంజ్ కార్ ఎవరిచ్చారు ? అనే మశాలపై పోలీసులు ఆరా తీయబోతున్నారు.
అదేసమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితుడు సాదుద్దీన్ ను ఆమ్నేషియా పబ్, కాన్ సీ యు బేకరీ, హత్యాచారం జరిగిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లనున్నారు. ఇన్నోవా కార్ దాచిపెట్టిన ప్రదేశానికి కూడా నిందితుడిని తీసుకెళ్ళి పోలీసులు ప్రశ్నించనున్నారు. సాదుద్దీన్ ద్వారా కేసుకు సంబంధించిన కీలక విషయాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.











