‘బాహుబలి’ లో ప్రభాస్ సవతి తల్లిగా రమ్యకృష్ణ .. అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. రాజమాత శివగామిగా.. సినిమాను నిలబెట్టిన చాలా పవర్ ఫుల్ పాత్ర అది. ఫస్ట్ పార్ట్ లో హైలైట్ అయిన అంశాల్లో .. ‘బాహుబలి’ కొడుకు శివుడ్ని బతికించి తాను ప్రాణ త్యాగం చేసే సీన్ ఒకటి. అలాగే.. సెకండ్ పార్ట్ లో ‘బాహుబలి’ మరణానికి కారణమయ్యే పాత్ర కూడా ఆమెదే.
అలా.. ప్రేక్షకులు జేజేలు పలికే స్థాయిలో అభినయించిన బాహుబలి, శివగామి లు మళ్లీ.. కలిసి నటిస్తే.. చూడాలని ప్రభాస్ అభిమానులకు ఎప్పటినుంచో కోరికగా ఉంది. ప్రభాస్ తదుపరి చిత్రం ‘సలార్’ తో వారి కోరిక నెరవేరబోతోందని టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రభాస్ సలార్.. ప్రస్తుతం కరోనా కారణంగా చిత్రీకరణ ను వాయిదా వేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ అక్క పాత్ర చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట దర్శకుడు. ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించాడట.
ప్రభాస్ తో మరోసారి నటించే అవకాశమొస్తే.. రమ్యకృష్ణ కాదంటుందా? వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం లైగర్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు చేస్తున్న రమ్యకృష్ణ సలార్ లో కూడా మెప్పించబోతోందని టాక్స్ వినిపిస్తున్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో రూపొందుతోన్న సలార్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి రమ్యకృష్ణ పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.











