కరోనాతో వెండితెర మసకబారిపోయింది. సినీ ప్రియులంతా ఓటీటీలతో సరిపెట్టుకున్నారు. లాక్ డౌన్ లో పలు మూవీస్, సిరీస్ లతో డిజిటల్ ఎక్స్ పీరియెన్స్ ను ఆస్వాదించారు. కానీ.. సిల్వర్ స్క్రీన్ పై ఉండే మ్యాజిక్ ఓటీటీ లతో రాదనేది కాదలేని సత్యం. స్టార్ హీరోల సినిమాలను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా? అంటూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ షూటింగుల సందడి మొదలైంది. అగ్ర కథానాయకులు ఒక్కొక్కరుగా తిరిగి సెట్స్ లోకి అడుగుపెడుతున్నారు. ఫ్యాన్స్ కి టీజర్స్ రూపంలో సర్ ప్రైజులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అండర్ ప్రొడక్షన్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ ముందు వరుసలో నిలుస్తుంది. ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను.. నిజాం నిరంకుశ పాలనను ఎండగట్టిన కొమరం భీమ్ సాహసాలను ఫిక్షనల్ రూపంలో ఈ చిత్రంలో చూపించబోతున్నాడు జక్కన్న. ఈ పీరియాడికల్ డ్రామా ఇటీవలే తిరిగి పట్టాలెక్కింది. ఇప్పటికే ఈ సినిమాలో అల్లూరిగా అదరగొట్టబోతున్న రామ్ చరణ్ టీజర్ వదిలారు. ఇక.. ఈనెల 22న కొమరం భీమ్ జయంతి సందర్భగా చిత్రంలో భీమ్ గా అలరించబోయే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది.
22న తారక్ ప్రోమో వస్తుంటే.. 23న ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ‘రాధేశ్యామ్’ టీజర్ ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. గోపీకృష్ణా మూవీస్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది చిత్రబృందం.
హిందీ సర్కిల్స్ లో హిట్టైనా తెలుగు ప్రేక్షకుల్ని మాత్రం ‘సాహో’ నిరాశపరిచింది. దాంతో ప్రభాస్ తన ఆశలన్నీ ‘రాధేశ్యామ్’పైనే పెట్టుకున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యూరప్ బ్యాక్ డ్రాప్ లో 60, 70ల నాటి ప్రేమకథగా రూపొందుతుంది. ఈ చిత్రంకోసం హైదరాబాద్ లో ఆ కాలం నాటి యూరప్ ని ప్రతిబింబించే సెట్స్ వేశారు. అయితే మళ్లీ రియల్ ఎక్స్ పీరియెన్స్ కోసం యూరప్ బాట పట్టింది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా. పూజా ద్విపాత్రాభినయంతో కనిపించబోతుందనే ప్రచారం ఉంది. ప్రభాస్ పుట్టినరోజు ఈనెల 23 అయితే పూజా బర్త్ డే ఈనెల 13. ఈనేపథ్యంలో ‘రాధేశ్యామ్’ నుంచి పూజా స్పెషల్ టీజర్ కూడా రిలీజయ్యే అవకాశాలున్నాయి. మొత్తంమీద.. ఈనెలలో అటు ‘ఆర్.ఆర్.ఆర్’తో ఎన్టీఆర్ ఇటు ‘రాధేశ్యామ్’తో ప్రభాస్ ఒక్కరోజు గ్యాప్ లో ఫ్యాన్స్ కి సర్ప్రైజులు ఇవ్వబోతున్నారన్నమాట.