అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై దుమ్ము రేపింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగంలో సత్తా చాటిన ముంబై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. డికాక్-రోహిత్ శర్మ ఇద్దరూ ధాటిగా ఆడటంతో 4.5 ఓవర్లకే జట్టు స్కోరు 49 పరుగులకు చేరుకుంది. ఈ తరుణంలో కార్తీక్ త్యాగీ చక్కని బంతితో డీకాక్(23)ని పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చారు.
సూర్యకుమార్ సత్తా
దేశవాళీలో తప్పా ఐపీఎల్ లో ఇప్పటి వరకు భారీ స్కోరు చేయని సూర్యకుమార్ యాదవ్ పై పెద్దగా అంచనాలు లేవు. ముంబై జట్టంటే ఇప్పటివరకు డికాక్, రోహిత్ శర్మ, పోలార్డ్, హార్దిక్ పాండ్య లాంటి బ్యాట్సమెన్ ఆటగాళ్ల పేరు వినబడేవి. వీరికి తాను ఏ మాత్రం తీసిపోనని రుజువుచేస్తు సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ సాగింది. నాన్ స్ట్రైక్ లో ఉన్న రోహిత్ ప్రేక్షకపాత్ర వహించేలా సూర్యకుమార్ ఇన్నింగ్స్ సాగింది. రోహిత్(35), ఇషాన్ కిషన్(0) స్వల్ప విరామాలలో ఔట్ అయినా సూర్యకుమార్ ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత కూడా దూకుడు పెంచడంతో ముంబై ఎవరూ ఊహించని స్కోరు చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ 47 బాల్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు.
పాండ్య ప్రతాపం
క్రునాల్ పాండ్య(12) పెవిలియన్ చేరడంతో హార్దిక్ పాండ్య క్రీజులోకి వచ్చారు. హార్దిక్ క్రీజులోకి వచ్చినప్పుడు జట్టు స్కోరు 14 ఓవర్లకు 117. వచ్చిరాగానే పాండ్య రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో మంచి టైమింగ్ తో ఆడుతున్న సూర్యకుమార్ కు సపోర్ట్ చేశాడు, స్ట్రైక్ రొటేట్ చేస్తూ సూర్యకుమార్ కు ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం ఇచ్చారు. 6 ఓవర్లు క్రీజులో ఉన్నా పాండ్యకు 19 బాల్స్ ఆడే అవకాశం మాత్రమే దక్కాయి. 30 పరుగులు చేసిన పాండ్య నాటౌట్ గా నిలిచారు. దీంతో ముంబై 193 పరుగులకు చేరుకుంది.
బాధ్యత తీసుకున్న బౌలర్లు
బ్యాట్సమెన్ జట్టుకు భారీ స్కోరు అందించడంతో ముంబై బౌలర్లు కూడా బాధ్యత తీసుకున్నారు. ముంబై పేసర్లు బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా ఫస్ట్ స్పెల్ లోనే వరుస విరామాలలో వికెట్లు తీయడంతో రాజస్థాన్ 12 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది. స్పిన్నర్ రాహుల్ చాహర్ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజస్థాన్ కీలక ఆటగాడు మహిపాల్ ను పెవిలియన్ చేర్చాడు. బట్లర్ మినహా మిగతా ఆటగాళ్లు ముంబై బౌలర్ల దాటికి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. బుమ్రా తన స్పెల్ లో 4 వికెట్లు తీయగా బౌల్ట్, ప్యాటిన్సన్ చెరో రెండు వికెట్లు తీసారు. దీంతో ముంబై కేవలం 18.1 ఓవర్లు మాత్రమే ఆడి 136 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో ముంబై 57 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన ముంబై 4 విజయాలు సొంతం చేసుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో సమానంగా తో 8 పాయింట్స్ సాధించింది. కానీ రన్ రేట్ ఆధారంగా (+1.488) ముంబై ఇండియన్స్ అగ్రస్థానానికి చేరుకుంది.











