కోర్టు ధిక్కారణ కేసులో ప్రశాంత్ భూషణ్ కు సుప్రీం ఒక రూపాయి ఫైన్ విధించింది. సెప్టెంబర్ 15 నాటికి చెల్లించడంలో విఫలమైతే ఆయనకు మూడు నెలల జైలు శిక్ష, మూడేళ్లపాటు ప్రాక్టీస్ చేయకుండా అడ్డుకుంటామని ధర్మాసనం తీర్పును వెలువరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కోర్ట్ కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పమని ధర్మాసనం ప్రశాంత్ భూషణ్ కు సూచించింది. సీనియర్ న్యాయవాది ఇలాంటి నేరానికి పాల్పడటం హర్షణీయం కాదని బీఆర్ గవాయ్, కృష్ణ మురారి, అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
తాను తప్పు చేయలేదని నమ్ముతున్నందున క్షమాపణ చెప్పలేనని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన విధి విధానాల అనుగుణంగానే తాను ఈ విమర్శలు చేశానని అందులో తప్పేమి లేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ధర్మాసనం ‘క్షమాపణ’ చెబితే తప్పేముందని ఆయనకు సూచించింది. క్షమాపణ చెబితే తప్పు చేసినట్లు కాదని అది ఒక మ్యాజిక్ పదమని చాలా గాయాలకు ఇది మంచి ముందుగా ఉపయోగపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. కానీ అందుకు ప్రశాంత్ భూషణ్ ఒప్పుకోలేదు. దీంతో ఉన్నత న్యాయస్థానం తమ తీర్పును ఆగస్ట్ 25న రిజర్వు చేసింది.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, న్యాయవ్యవస్థలపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లు సంచలనం రేపాయి. ఈ ట్వీట్లను తొలగించమని సుప్రీం ట్విట్టర్ ను ఆదేశించడంతో తొలగించింది. ఇదే సమయంలో ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై కేసును సుమోటోగా సుప్రీం స్వీకరించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్ రూపాయి కడతాడా? లేదా? అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది. ధర్మాసనం పదే పదే చెప్పినా క్షమాపణ చెప్పేందుకు ఒప్పుకోని ఆయన ఫైన్ కట్టడనే వార్తలు వినబడుతున్నాయి. కట్టకపోతే సుప్రీం చెప్పినట్లు శిక్షలకు కట్టుబడి ఉండవలసిందే. ఏం జరుగుతుందో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు ఆగవలసిందే!