‘‘ఎల్‌కేజీ నుంచి 9వ తరగతి డేస్కాలర్ విద్యార్థుల తల్లిదండ్రులకు గమనిక. దెందులూరులో ముఖ్యమంత్రి రాజకీయ సభకు అన్ని పాఠశాల బస్సులు తీసుకెళ్తున్నందున ఎల్‌కేజీ నుంచి 9వ తరగతి డేస్కాలర్ విద్యార్థులకు రేపు స్కూలు సెలవు. తిరిగి స్కూలు సోమవారం తెరవబడుతుంది’’ ఈ మెసేజ్ అన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు శుక్రవారం తల్లిదండ్రులకు పంపాయి. వైసీపీ ప్రచార సభ ‘సిద్ధం’ కోసం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కలిసి కార్యకర్తలను తరలించడానికి సన్నాహాలు చేశారు. పార్టీ ప్రచార సభను ప్రభుత్వ కార్యక్రమంగా పేర్కొంటూ అడ్డగోలుగా ప్రైవేటు స్కూలు బస్సులను అప్పనంగా వాడుకున్నారు. వాటిలో జనాలను తరలించారు. బస్సులు కావాలని స్కూళ్లపై ఒత్తిడి రావడంతో చేసేది లేక అన్ని స్కూళ్లు సెలవు ప్రకటించుకున్నారు. అసలే వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న వేళ స్కూళ్లు మూసేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉన్నారు.
సిద్ధం సభ కోసం ప్రతి నియోజకవర్గం నుంచి వేల మంది జనాన్ని తరలించి.. సభా ప్రాంగణం మొత్తాన్ని జనాలతో నింపేయాలని అధిష్ఠానం హుకుం ఇచ్చింది. దీంతో రెండు జిల్లాల్లోని పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తమై భారీగా జనాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. అందుకోసం స్కూలు బస్సులు తీసుకున్నారు. జిల్లా విద్యా, రవాణా శాఖల నుంచి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు అనధికారికంగా ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాక ఆ ప్రైవేటు స్కూళ్లు కూడా ఏమీ చేయలేకపోయాయి. పైగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ చీఫ్ ల నుంచి కూడా స్కూళ్లపై ఒత్తిడి పెరగడంతో.. విధిలేని పరిస్థితుల్లో బస్సులన్నీ సిద్ధం సభకు పంపారు.
ఇలా ప్రతిసారి సీఎం సభ ఉన్నప్పుడల్లా తమపై అధికారులు ఒత్తిడి చేసి బస్సులు తీసుకెళుతున్నారని యాజమాన్యాలు వాపోతున్నాయి. మరోవైపు, స్కూళ్లు బంద్ పెట్టడంతో తల్లిదండ్రులు కూడా తమను ప్రశ్నిస్తున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. అటు రాజకీయ ఒత్తిళ్లు.. ఇటు తల్లిదండ్రుల నుంచి వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ప్రైవేటు స్కూళ్లు చెబుతున్నాయి. విజయవాడలోని కొన్ని స్కూళ్లు మాత్రం శనివారం సెలవు ఇవ్వకుండా.. బస్సులు అందుబాటులో లేవని అందువల్ల తల్లిదండ్రులే వారి పిల్లలను స్కూళ్లకు తీసుకురావాలని మెసేజ్ పంపాయి.
ఈ స్కూల్ బస్సుల్లో జనం తరలింపులో సచివాలయ సిబ్బంది సహకారం కూడా బాగా ఉంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా బస్సుల్లో, కార్లలో జనాలను తరలించారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి 50 బస్సులు, విజయవాడ సెంట్రల్ 60, విజయవాడ వెస్ట్ 50, నందిగామ 80, జగ్గయ్యపేట 60, మైలవరం 50, తిరువూరు 60 బస్సులను ఏర్పాటు చేశారు. ఇవికాకుండా వందల సంఖ్యలో కార్లను కూడా ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, పెడన, గన్నవరం నియోజకవర్గాల నుంచి 30 చొప్పున 150 బస్సులు తరలించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సరాసరిన 50 నుంచి 100 కార్లను కూడా తరలించారు.