వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ ఒంటెత్తు పోకడగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత నష్టం కలిగిస్తున్నాయో తాజా ఘటన ఒకటి నిరూపించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ జగన్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ అయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈ సారి కూడా టికెట్ ఇవ్వాలని జిల్లా క్యాడర్ అంతా కోరినప్పటికీ అధిష్ఠానం పెడచెవిన పెట్టింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి మాగుంటకే టికెట్ ఇప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా.. జగన్ ఒప్పుకోలేదు. చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే టికెట్ ఖరారు చేశారు.
దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రచార ఫ్లెక్సీల చిచ్చు మొదలైంది. జిల్లా కొత్త ఇంచార్జి అయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. మరోవైపు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ కో ఆర్డినేటర్ మేరుగు నాగార్జున క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ఒంగోలులో జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వీటిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలను కూడా బాగా కనిపించేలా ప్రింట్ చేశారు. ఇది చేసిన కొంత మంది గురువారం రాత్రి ఈ ఫ్లెక్సీలు చించేసి తగలబెట్టారు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.
మంత్రి మేరుగు నాగార్జున తన కోసం ఒంగోలు నగరంలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వైసీపీలో కొన్ని పరిస్థితుల వల్ల దాదాపు నెల రోజులుగా ప్రారంభోత్సవం చేయకుండా ఉన్నారు. అప్పటి రీజినల్ కో ఆర్డినేటర్ వి. విజయసాయి రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా ప్రారంభించాలని చూశారు. కానీ సాధ్యం కాలేదు. తాజాగా కొత్త ఇంఛార్జిగా నియమితులు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో మంత్రి ఆఫీసుకు వెళ్లే ప్రవేశద్వారంతో పాటు నేషనల్ హైవే డివైడర్ పైన కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కింద మంత్రి మేరుగు నాగార్జున, మధ్యలో బాలినేని చిత్రాలు ఉంచారు.
గతంలో బాలినేని, మేరుగు నాగార్జున చిత్రాలతో మాత్రమే ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. తాజాగా వాటిని మార్చి చెవిరెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో.. వాటిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టేశారు. అయితే, ఈ పని మేరుగ లేదా బాలినేని అనుచరులు చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇలా ఒంగోలు వైసీపీలోని విభేదాలు చివరికి ఎక్కడికి దారి తీస్తాయనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది.