బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తనదైన సత్తా చాటుతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు ఇప్పుడు ఫ్యామిలీ ట్రబుల్స్ లో చిక్కుకుందా? తనను కని, పెంచి, జాతి గర్వించదగ్గ ఓ క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులతో ఆమెకు విభేదాలు వచ్చాయా? ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్లిపోయిందా? ఫ్యామిలీతో ఆమె దాదాపుగా బంధాలను తెంచేసుకుందా?.. ఈ తరహా ప్రశ్నలు జాతీయ మీడియాలో ప్రచురితమైన ఓ కథనం ద్వారా పెను కలకలమే రేపుతున్నాయి.
అసలు ఫ్యామిలీ మెంబర్స్ వెంట లేకుండా బయట పెద్దగా కనబడని పీవీ సింధు.. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న మాట అయితే వాస్తవమే గానీ.. పీవీ సింధుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవాలేంటి? మీడియా కథనంపై పీవీ సింధు ఏమని వివరణ ఇచ్చింది? అసలు ఆ కథనాన్ని రాసిన జర్నలిస్ట్‌పై సింధు ఏ రేంజిలో ఫైరయ్యారన్న విషయాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరిగిందన్న విషయంలోకి వెళ్తే..
ఎక్కడ కనిపించినా.. చాలా కూల్‌గా, కేవలం తన గేమ్ పైనే మాట్లాడే పీవీ సింధు ఓ పది రోజుల క్రితం లండన్ వెళ్లారు. ఎప్పుడు విదేశాలకు వెళ్లినా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే సింధు ఈ దఫా ఒంటరిగానే లండన్ వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు చెందిన ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్.. కుటుంబంలో వివాదాలు తలెత్తడం వల్లే పీవీ సింధు ఒంటరిగానే విదేశాలకు వెళ్లారని, ఇకపై ఆమె తన కుటుంబానికి దూరమైపోయారని, లండన్ లో ఆమె ఇకపై ఒంటరిగానే ఉండిపోనున్నారని, అక్కడే తన ప్రాక్టీస్ కొనసాగించనున్నారని ఓ సంచలన కథనం రాశారు. అంతేకాకుండా తమపై అలిగి లండన్ వెళ్లిన పీవీ సింధును తిరిగి ఇంటికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడుతున్నారని కూడా సదరు కథనంలో ఆ జర్నలిస్ట్ రాసుకొచ్చారు.
ఈ కథనాన్ని చూసిన మరుక్షణమే పీవీ సింధు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ఎంట్రీ ఇచ్చిన సింధు.. టైమ్స్ కథనంపైనా, సదరు కథనం రాసిన జర్నలిస్ట్ పైనా ఓ రేంజిలో ఫైరయ్యారు. ఫిట్ నెస్ లో భాగంగా న్యూట్రిషన్ కోసం తాను కొన్ని రోజుల క్రితం లండన్‌కు వచ్చానని, నిజానికి తాను తన తల్లిదండ్రుల అనుమతితోనే లండన్ వచ్చానని సింధు పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాకుండా తన కోసం తమ జీవితాన్నే త్యాగం చేసిన తల్లిదండ్రులతో తనకు సమస్యలు, గొడవలు ఎందుకు ఉంటాయని కూడా ప్రశ్నించారు. తన కుటుంబంతో తాను చాలా క్లోజ్ గా ఉంటానని, వారు ఎల్లప్పుడూ తనను సపోర్ట్ చేస్తూనే ఉంటారని, ఇప్పుడు కూడా తాను ప్రతిరోజూ వారితో మాట్లాడుతూనే ఉన్నానని కూడా సింధు వివరణ ఇచ్చింది.
ఇక అంతిమంగా తనపైనా, తన కుటుంబంపైనా అసత్య ప్రచారం చేసేలా కథనం రాసిన టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ వైఖరిపై పీవీ సింధు నిప్పులు చెరిగింది. ఈ తరహా వార్తలు రాసేటప్పుడు నిజాలు తెలుసుకుని రాయాలని హితవు పలికింది. ఈ తరహా చర్యలను, రాతలను సదరు జర్నలిస్ట్ మానుకోకపోతే అతడిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటానని కూడా సింధు హెచ్చరించింది. మొత్తంగా వాస్తవమేంటో తెలుసుకోకుండా టైమ్స్ జర్నలిస్ట్ రాసిన కథనంపై పీవీ సింధు ఓ రేంజిలో ఫైరయ్యింది. అంతేకాకుండా ఈ తరహా కథనాలపై తాను ఏ తరహాలో స్పందించే విషయాన్ని కూడా ఆమె గట్టిగానే చెప్పినట్టైంది.
I came to London a few days back to work on my nutrtion and recovery needs with GSSI. Infact I have come here with the consent of my parents and absolutely they were no family rifts in this regard. pic.twitter.com/zQb81XnP88
— Pvsindhu (@Pvsindhu1) October 20, 2020