నటసింహ నందమూరి బాలకృష్ణ 16 ఏళ్ళ క్రితం భారీ ఎత్తున నిర్మాణం ప్రారంభించి.. మధ్యలోనే ఆపేసిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’. పాండవులు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో చేరిన ఘట్టంతో ఒకప్పుడు యన్టీఆర్ నటించిన నర్తనశాల చిత్రాన్నే అప్పట్లో బాలయ్య రీమేక్ చేయాలని తన స్వీయ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించారు. 2004 లో మొదలైన ఈ సినిమాలో బాలయ్య అర్జునుడిగానూ, బృహన్నలగానూ, సౌందర్య ద్రౌపదిగానూ, శరత్ బాబు ధర్మరాజుగానూ, శ్రీహరి భీముడిగానూ నటించగా.. ఈ సినిమా సౌందర్య అకాల మరణం వల్ల ఆ ప్రాజెక్ట్ అర్ధంతరంగా ఆగిపోయింది.
అయితే ఇంతవరకూ షూట్ చేసిన 17నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాల్ని ఈ నెల 24న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్ విడుదలైంది. అర్జునిగా బాలయ్య ఆ పోస్టర్స్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ నెల 24లో యన్బీకే థియేటర్స్ లో శ్రేయాస్ ఈటీ ద్వారా పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాను విడుదల చేస్తున్నారు. టికెట్ ధర మినిమమ్ 50 రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని బసవతారకం ట్రస్ట్ కు ఇస్తున్నామని శ్రేయాస్ మీడియా చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.











