‘సిసింద్రీ’ సినిమాతో పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే టాలీవుడ్ స్క్రీన్ మీదకు పాక్కుంటూ వచ్చాడు అక్కినేని వారి వారసుడు అఖిల్. ఇంకా మాటలు కూడా రాని ఆ వయసులో కేవలం తన నవ్వుతోనే అందరినీ పడగొట్టేశాడు. అతడు పెద్దవాడయ్యాకా హీరోగా నటిస్తే చూడాలని అప్పట్లోనే ముచ్చటపడ్డారు ప్రేక్షకులు. అందరూ కోరుకున్నట్టుగానే అఖిల్ హీరో అయిపోయాడు. అయితే హీరో అవడానికి ముందే ఒక యాడ్ లో నటించాడు, మనం సినిమా లో గెస్ట్ రోల్ చేశాడు. దాని వల్లనే అతడి హ్యాండ్సమ్ లుక్ కి .. హీరో అవడానికి ముందే మంచి క్రేజ్ ఏర్పడిపోయింది. అతడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
అందుకే.. అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’కి భారీ బడ్జెట్ పెట్టారు.. దానికి తగినట్టుగానే భారీ బిజినెస్ జరిగిపోయింది. కట్ చేస్తే.. వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కించినప్పటికీ.. ‘అఖిల్’ సినిమా అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగాఫెయిల్ అయింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ‘మిస్టర్ మజ్ను, హలో’ సినిమాలు రెండూ అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఇప్పుడు అక్కినేని ప్రిన్స్ .. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అఖిల్ కు తొలి విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు.
సాధారణంగా ఏ నటవారసుడైనా.. సినిమా, సినిమాకీ తన రేంజ్ పెంచుకుంటూ.. కెరీర్ గ్రాఫ్ నూ పీక్స్ లోకి తీసుకెళ్లి తన మార్కెట్ ను, ఫాలోయింగ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తాడు. కానీ అఖిల్ విషయంలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. తొలి సినిమా అఖిల్ కు క్రియేట్ అయిన క్రేజ్.. ఆ తర్వాత రాను రాను తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు కెరీర్ గ్రాఫ్ పూర్తి డౌన్ ఫాలో ఉంది. అందుకే ఇప్పుడు అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో హిట్టొస్తే అదే పదివేలు అన్నట్టుంది పరిస్థితి. ఈ సినిమాతో అఖిల్ హీరోగా నిలదొక్కుకుంటాడా అనేకన్నా.. హీరో అనిపించుకుంటే చాలు.. అనే స్థాయికి దిగిపోయాయి చర్చలు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్కినేని అభిమానులకు భరోసానిచ్చే రీతిలో .. సురేంద్రరెడ్డి దర్శకత్వంలోని సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. రేసుగుర్రం దర్శకుడి చేతిలో పడితే.. అఖిల్ కెరీర్ గెలుపు గుర్రం లా పరిగెడుతుందని సంబరపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే సురేంద్రరెడ్డి ఇందులో అఖిల్ ను ఒక యాక్షన్ స్పైగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. దీంతో అక్కినేని యువరాజుకు విజయ కిరీటం దక్కడం ఖాయమని చర్చించుకుంటున్నారు.
అతడి తొలి సినిమానే ఇలాంటి దర్శకుడితో పడుంటే.. బాగుండేదని అనుకుంటున్నారు. ఏదేతైనేం..మొత్తానికి సురేంద్రరెడ్డి చేతుల్లో ఇప్పుడైనా పడ్డాడు. ఈ సినిమాతో అతడికి యాక్షన్ హీరో ఇమేజ్ వస్తే అతడి కెరీర్ గాడిలో పడ్డట్టే అని చెప్పుకుంటున్నారు. ధ్రువ , సైరా నరసింహారెడ్డి సినిమాలతో వరుసగా విజయాలందుకున్న సూరి.. అఖిల్ కు కూడా అదిరిపోయే రేంజ్ లో హిట్టిస్తాడని భావిస్తున్నారు అభిమానులు. మరి ఈ సినిమాతోనైనా అక్కినేని అఖిల్ .. హీరోగా విజయకేతనం ఎగురవేస్తాడేమో చూడాలి.











