అనుకున్నదే జరిగింది. కేవలం అనర్హత వేటు భయంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడని నిరూపితమైంది. ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా..వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కేవలం 11 నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేశారు. ఉన్న ఆ 11 నిమిషాల్లోనూ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు ఆ పార్టీ నేతలు. ఐతే వైసీపీ నేతల నినాదాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో సభ్యులతో కలిసి జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
గవర్నర్ ప్రసంగం కావడంతో ఉభయ సభలు ఒకే దగ్గర సమావేశమయ్యాయి. సభలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పక్కనే కూర్చున్నారు జగన్. మండలిలో బొత్స ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేదు. దీంతో బొత్స మిగతా సభ్యులతో కలిసి నినాదాలు చేయలేదు. ఐతే అందరితో కలిసి తాను కూడా బయటకు వెళ్లిపోయారు. సభలో తమను పట్టించుకునే నాథుడే లేడని, జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతోనే సభ నుంచి వాకౌట్ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు.
గతంలో అసెంబ్లీకి వెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఐతే అసెంబ్లీకి ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ RRR వార్నింగ్‌లతో జగన్ యూటర్న్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకుని..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. కానీ తీరా అసెంబ్లీలో అరగంట కూడా ఉండలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే సభ నుంచి వాకౌట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాసమస్యల కోసం కాకుండా ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ సభ్యులు పట్టుబట్టడం హాస్యాస్పదంగా మారింది. ఇక వైసీపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే జగన్ అసెంబ్లీకి హాజరయ్యారంటూ ప్రచారం జరుగుతోంది.











