తెలుగు తెరపై వరుస విజయాలతో దూసుకుపోతున్న అందమైన కథానాయికలలో, పూజా హెగ్డే తరువాత స్థానంలో రష్మిక మందన కనిపిస్తోంది. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ కన్నడ భామ, ‘గీత గోవిందం’ సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘గీత’ పాత్ర యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఈ పాత్రలో కళ్లతోనే ఆమె పలికించిన హావభావాలకు కుర్రాళ్లు దాసోహం అన్నారు. తమ ఊహల పల్లకిలో ఆమెను ఊరేగించారు. ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించడంతో ఆమె క్రేజ్ .. డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఆ తరువాత రష్మిక చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ .. ‘భీష్మ’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె ‘సంస్కృతి’ పాత్రలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కాస్త కామెడీ టచ్ వున్న ఈ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘భీష్మ’ సినిమాలో ‘చైత్ర’ పాత్రలోను ఆమె ఒక రేంజ్ లో సందడి చేసింది. గ్లామర్ పరంగా .. నటన పరంగా తన సత్తా చాటుకుంది. వరుసగా పడిన ఈ రెండు హిట్లు .. రష్మికను మరోస్థాయికి తీసుకెళ్లాయి. దాంతో ఇప్పుడు ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో రష్మిక తన పారితోషికాన్ని భారీగానే పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు ఆమె ఎంత తీసుకునేదనే విషయాన్ని అలా ఉంచితే, పెంచిన తరువాత ఆమె అందుకునే పారితోషికం 2 కోట్లకి పై మాటేనని అంటున్నారు. అంతమొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడటం లేదట. ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ప’ సినిమా చేస్తోంది.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, అల్లు అర్జున్ సరసన ఆమె నటిస్తోంది. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే మరో సినిమా కూడా ఆమె చేతిలో వుంది. ఈ రెండు సినిమాల తరువాత ఆమె పారితోషికం మరింత పెరిగినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘సుల్తాన్’ అనే సినిమాతో ఆమె తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతూ ఉండటం విశేషం.
Also Read ;- మరోసారి జతకట్టనున్న నాని, రష్మిక మందన్నా?