ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అయ్యాయి అంటేనే ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎప్పుడెప్పుడు అమ్మ వారిని దర్శించుకుందామా అని ఎదురు చూస్తుంటారు. కానీ.. ఈ సంవత్సరం కరోనా పుణ్యమా అంటూ అమ్మవారి దర్శనానికి భక్తుల సంఖ్యను ఇప్పటికే తగ్గించేశారు. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తుంది దేవస్థానం కమిటీ.
ఇప్పుడు అది కూడా అందని ద్రాక్షే..
అసలే భక్తుల సంఖ్యను తగ్గించి అమ్మ దర్శనానికి అనుమతినిస్తుంటే… ఇప్పుడు అది కూడా సామాన్య ప్రజలకు దూరం అవుతుంది. నవరాత్రులు సందర్భంగా కొండపై అమ్మవారి దర్శనం కేవలం వీఐపీలకే లభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా రోజుకు పదివేల స్లాట్ కన్నా ఎక్కువ మందిని అనుమతించేది లేదంటూ ఆలయాధికారులు తెలిపారు.
ఉచిత దర్శనానికి మంగళం..
ఆలయ అధికారులు తెలిపినట్లుగానే గత రెండు రోజుల నుంచి ఉచిత దర్శనానికి మంగళం పాడేశారు. కేవలం 100,300,500 రూపాయలతో కరెంట్ బుకింగ్ అంటూ మూడు కౌంటర్ల ద్వారా టిక్కెట్లను విక్రయిస్తున్నారు. కేవలం వినాయకుని గుడి, మహా గణపతి ప్రాంగణం వద్ద మాత్రమే ఉచిత దర్శనమంటూ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను వెనక్కి పంపుతున్న అధికారులు.
మాకు దర్శనం కల్పించండి
సామాన్య భక్తులకు ఉచిత దర్శనం కల్పించాలంటూ భక్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు. కేవలం వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కరోనా వల్ల దర్శనం లేదని వెనక్కి పంపిస్తున్నారు. మరి టిక్కెట్లు కొన్న వారి దర్శనానికి కరోనా అడ్డు కాలేదా..? అంటూ సామాన్య భక్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంత మాత్రనికే వెనక్కి పంపేస్తారా..?
ప్రతి సంవత్సరం నవరాత్రుల సందర్భంగా ఎంతో దూరం నుంచి కుటుంబ సమేతం గా వస్తాం. మాకు ముందుగా స్లాట్ లు ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు.అంత మాత్రనికే మమ్మల్ని దర్శనం చేసుకోనివ్వారా అంటూ ఓ భక్తుడు తన ఆవేదనను వెల్లబుచ్చారు. ఎంతో దూరం నుంచి వస్తున్నాం. పైగా వర్షాలు కూడా పడుతున్నాయి. ఇటువంటి సమయంలో ఇలా అర్ధాంతరంగా వెనక్కి పంపితే మేము ఎక్కడికి వెళ్లాలంటూ కొందరు భక్తులు తమ గోడును వినిపిస్తున్నారు.










