వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతానికి సంబంధించి రెండేళ్లుగా నలుగుతున్న మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది. వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్య నోరు విప్పిన నేపథ్యంలో వివేకా మర్డర్ మిస్టరీ వీడిపోయిందనే అంతా అనుకుంటున్నారు. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ముందు నోరు విప్పిన రంగయ్య చాలా విషయాలే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వివేకా హత్యకు పథకం రచించింది ఎవరు? ప్రత్యక్షంగా హత్యలో పాలుపంచుకున్నదెవరు? వారికి సహకరించిందెవరు? హంతకులకు ఏ మేర డబ్బు ముట్టజెప్పారు? వంటి వివరాలన్నింటినీ రంగయ్య వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పేరు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే గంగిరెడ్డిని పలు దఫాలుగా సుధీర్ఘంగా విచారించిన సీబీఐ.. ఆయన నుంచి కూడా పలు కీలక వివరాలను సేకరించింది. గంగిరెడ్డితో పాటు ఇంకా చాలా మందిని సీబీఐ అధికారులు రోజుల తరబడి విచారించారు.
డీఐజీ రిలీవ్.. ఐజీ ఇన్
రంగయ్య వాంగ్మూలం ఇచ్చిన మరునాడే.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సీబీఐ డీఐజీ సుధా సింగ్ ను అక్కడి నుంచి బదిలీ చేసి.. ఆమె కంటే తక్కువ ర్యాంకు అధికారికి ఈ కేసు దర్యాప్తు అప్పగిస్తున్నారంటూ గడచిన రెండు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కేసు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కేసు మిస్టరీని దాదాపుగా బద్దలు కొట్టేసిన సుధా సింగ్ ను బదిలీ చేయడం ఏమిటని విపక్షాలు కూడా తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాయి. మొత్తంగా సుధా సింగ్ బదిలీ.. ఆమె కంటే తక్కువ హోదా కలిగిన అధికారిని నియమిస్తున్నారన్న వార్తలు అయితే కలకలం రేపాయి. ఈ వార్తలే నిజమైతే.. ఇక వివేకా మర్డర్ మిస్టరీ ఎన్నటికీ వీడిపోదన్న వాదనలూ వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీ ఫేక్ వార్తలేనంటూ సీబీఐ ఆదివారం నాడు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక అరెస్టులే..
సీబీఐ తాజా నిర్ణయం ప్రకారం వివేకా కేసును ఇప్పటిదాకా డీఐజీ స్థాయి అధికారి సుధా సింగ్ పర్యవేక్షిస్తే.. ఇప్పుడు ఐజీ స్థాయి అధికారి అయిన రామ్ కుమార్ ఈ కేసును పర్యవేక్షించనున్నారు.సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు అందుకున్న వెంటనే ఆదివారమే రామ్ కుమార్ కడపకు చేరుకున్నారు. వచ్చీ రాగానే..యాక్షన్ ను ప్రారంభించిన ఆయన.. సోమవారం నాడు కేసులో కీలక నిందితులుగా ఉన్న వారిని విచారించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా రంగయ్య వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులను విచారణకు పిలవడమో, లేదంటే.. వారిని ఏకంగా అరెస్ట్ చేయడమో జరుగుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే డీఐజీ స్థాయి అధికారిని తప్పించి ఐజీ స్థాయి అధికారికి ఈ కేసు బాధ్యతలు అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వివేకా మర్డర్ కేసు మిస్టరీ దాదాపుగా వీడిపోయిందన్న వాదనల నేపథ్యంలో అసలు నిందితులు ఎవరన్న వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.











