పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి కమ్ బ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తర్వాత పవన్, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా, హరీష్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. అలాగే వీటి తర్వాత పవన్ మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు.
ఈ రీమేక్ వెర్షన్ ను సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. దర్శకుడు మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఈ స్టోరీని తీర్చిదిద్దాడని సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రే కాకుండా మరో ప్రధాన పాత్ర కూడా ఒకటి ఉంది. ఆ పాత్ర యువ స్టార్ హీరో రానా చేస్తున్నట్లు అప్పట్లో టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. ఈ వార్తపై దర్శకుడు కాని, సినిమా యూనిట్ కాని ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు.
తాజాగా మీడియా ఇంటరాక్షన్ లో ఈ విషయంపై రానాను ప్రశ్నించగా, హీరో రానా స్పందించాడు. తనను ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సినిమా కోసం సంప్రదించిన మాట నిజమేనని, కాని నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదని రానా తెలిపాడు. ప్రస్తుతం తను హీరోగా నటిస్తోన్న సినిమాలతో బిజీగా ఉన్నానని, త్వరలోనే ఈ సినిమాపై ఒక నిర్ణయం తీసుకుంటానని రానా తెలిపాడు. అయితే ఈ సినిమాలో తనను చేయమంటున్న పాత్ర తనకు బాగా నచ్చిందని దర్శకుడు ఈ కథను బాగా మలిచాడని రానా తెలిపాడు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనేకమంది పేర్లు వినపడుతున్నాయి కాని దర్శకుడు మాత్రం ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవ్వడమే. మరి తెలుగు వెర్షన్ కు పవన్ ఏ రేంజ్ లో హైలైట్ అవుతాడో చూడాలి.