ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో కోదండరాముని విగ్రహం పునః ప్రతిష్టకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్రం ప్రకారం విగ్రహాల పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. హోమం పూర్తైన తర్వాత సాంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆలయ ఆధునికీకరణలో భాగంగా గర్భాలయాన్ని కదిలించకూడదని అధికారులు భావిస్తున్నారు. పురాతన కాలంలో నిర్మించినా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ లోపలి భాగాన్ని మాత్రమే పూర్తిగా ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయంలో గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణలు చేసే ప్రాకారాలను పూర్తి స్థాయిలో పునర్ నిర్మించనున్నారు. కొండపై జరిగే అభివృద్ధి పనులకు సరిపడ నీరు అందుబాటులో ఉంచేందుకు దేవాదాయశాఖ యుద్ధప్రాతిపదికన వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆలయంతో పాటు రామతీర్థం కొండ మెట్ల మార్గాన్ని కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భక్తులు కొండపైకి సులభంగా చేరుకునేందుకు మెట్ల మార్గాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఆలయానికి ఆనుకుని ఉన్న కోనేరును కూడా పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నారు.
Must Read ;- అశోక్ గజపతి విరాళం తిరస్కరణ.. రామతీర్థం కేంద్రంగా మరో వివాదానికి సర్కారు తెర
ఈనెల 23నాటికి విగ్రహాలు అందజేత
ఇదిలాఉంటే.. రామతీర్థం ఆలయంలో ప్రతిష్ఠించేందుకై శ్రీరామచంద్రుడి మూలవిరాట్‌తో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు రూపొందిస్తున్నారు. ఈనెల 23నాటికి విగ్రహాలను శిల్పులు దేవాదాయశాఖ అధికారులకు అప్పగించనున్నారు. రామతీర్థం ఆలయ ఆధునికీకరణ, నూతన విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. విగ్రహాల ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం, ఆగమశాస్త్రం ప్రకారం జరగాల్సిన పనుల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా దేవాదాయశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.
విజయనగరం జిల్లాలో రామతీర్థం క్షేత్రంలో గల కోదండరాముని విగ్రహం ధ్వంసం ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ వైపు భక్తులు, మరోవైపు రాజకీయ పార్టీలు చేసిన ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకిపోయింది. దాంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఓవైపు ఘటనకు బాధ్యులను పట్టుకునే చర్యలు చేపడుతూనే.. మరోవైపు ధ్వంసానికి గురైన విగ్రహాల స్థానంలో విగ్రహాల పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తోంది.
రూ.3 కోట్లతో రామతీర్థం పునః నిర్మాణం : మంత్రి వెల్లంపల్లి
రామతీర్థం శ్రీ రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది, పునః నిర్మాణానికి మూడు కోట్ల రూపాయులు కేటాయించినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ సెక్రటరీ గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ పి.అర్జునరావు, ఎస్.ఈ ఎ శ్రీనివాస్, రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ, డిఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పండితుల సలహాలు, వైఖాసన ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయ అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. పునః నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. 700 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయ నిర్మాణం పూర్తిగా రాతి కట్టడాలతో జరుతుందన్నారు. కోదండ రాముడి విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్తానం వారు తయారు చేసి అందజేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా రామతీర్థం మెట్లు మార్గం సరిచేయడంతో పాటు కొత్త మెట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయ పరిసరాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంకరణ, శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపర్చటం, కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు, ప్రాకార నిర్మాణం, హోమశాల, నివేదన శాల నిర్మాణం కూడా చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
Must Read ;- రామతీర్థం సందర్శించిన చినజీయర్











