(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంను త్రిదండి చినజీయర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా శిరచ్ఛేదనకు గురైన కోదండ రామాలయాన్ని, స్వామివారి విగ్రహాన్ని, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు. అయితే చినజీయర్ స్వామి రామతీర్థం పర్యటనను మాత్రం దేవాదాయశాఖ గోప్యంగా ఉంచింది. ఈ సందర్భంగా చినజీయర్ స్వామికి రామతీర్ధంలో పూర్ణ కలశంతో వేద పండితులు స్వాగతించారు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు
రామతీర్థం లాంటి ఘటనలు ఇంకెక్కడా పునరావృతం కాకూడదని, అందుకు దేవాదాయ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా అన్ని దేవాలయాలకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి స్పష్టం చేశారు. రామతీర్థంలోని కోదండరాముని ఆలయ సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామతీర్థంలో కోదండరాముని ఆలయ పునర్నిర్మాణానికి ఆగమశాస్త్ర అనుగుణంగా దేవాదాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. సంవత్సరంలోపు రామతీర్థ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.
ధనుర్మాసం పూర్తి కాగానే మొదటిగా రామతీర్థం వచ్చినట్లు తెలిపారు. దేవాలయాలు, దేవతా విగ్రహాల ధ్వంసం హేయమైన చర్యయని, అందుకు రామతీర్థ ఘటన పరాకాష్ట అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, భక్తులు నిత్యం వచ్చేలా ఆలయాలను తీర్చిదిద్దితే, రామతీర్థం వంటి ఘటనలు చోటుచేసుకోవని అన్నారు. రామతీర్ధం ఘటన ఓ దుస్సాహసమని, ఆలయాల భద్రతపై రామతీర్ధం ఘటన ఓ హెచ్చరికయని అన్నారు. రక్షణ లేని ఆలయాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు. ఏడాది లోగా రామతీర్ధం కొండపై పునర్ నిర్మాణ పనులు పూర్తి కావాలని, అంత వరకు కొండ కిందన ఉన్న ఆలయంలో స్వామి వారికి నిత్య సేవలు అందించాలని తెలిపారు.
ఈ పర్యటనలో చినజీయర్ స్వామి శిష్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా ఆద్యంతం పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు.
Must Read ;- విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు