(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
దక్షిణ భారత అయోధ్యగా, ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరు గాంచిన విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో నెలరోజుల్లోగా కోదండరాముని ఆలయం నూతనంగా నిర్మించనున్నట్లు, ఆగమశాస్త్రానికి అనుగుణంగా కోదండరాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఖండనకు గురైన కోదండరాముని శిరస్సును ఏమి చేస్తారు? ఎక్కడ భద్ర పరుస్తారు? ఆలయాన్ని పునర్నిర్మిస్తారా? తదితర అంశాలు ప్రస్తుతం ఉత్తరాంధ్రలో తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి. వీటిపై “లియో న్యూస్” దృష్టి సారించగా అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
విగ్రహ నిమజ్జనం తర్వాతే ..
విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహానికి జరిగిన అపచారం తెలిసిందే. విగ్రహం తల భాగాన్ని ఖండించి కోనేరులో పడేశారు దుండగులు. ఈ దుశ్చర్యపై ఒకవైపు పోలీసు విచారణ జరుగుతోంది.. మరోవైపు రాజకీయ వేడి రాజుకుంటూనే ఉంది. అయితే, ఈ విగ్రహాన్ని ఇప్పుడేం చేస్తారు అనే అంశాన్ని పరిశీలిస్తే .. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ.. విగ్రహాన్ని ఎక్కడ, ఎలా , ఏమి చేయాలనే విషయంపై పండితులతో చర్చించారు దేవాదాయ శాఖ అధికారులు, మంత్రులు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన మంత్రులు దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో సమావేశమయ్యారు. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయ పునర్నిర్మాణం చేపట్టాలని వేద పండితులు మంత్రులకు సూచించారు. ముందుగా బాలాలయాన్ని కట్టాలని తెలిపారు. ధ్వంసమైన విగ్రహాన్ని సముద్ర తీరాన నదీసంగమంలో నిమజ్జనం చేయాలని, అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. పాత విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత కొత్త ఆలయ రూపు రేఖలు, నిర్మాణంపై తొలి అడుగు పడాలని అర్చక స్వాములు సూచించినట్లు తెలుస్తోంది.
కొత్త విగ్రహం పునః ప్రతిష్ట
ఆగమశాస్త్రం ప్రకారం .. అర్చక స్వాముల సూచన మేరకు రామతీర్థం కొండపై కొత్తగా మరో కోదండరాముని విగ్రహం తయారు చేయించి పునః ప్రతిష్ట చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు పేర్కొన్నారు. మంచి ముహూర్తం చూసి జనవరి చివరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. ఇందు కోసం ముగ్గురు పండితులతో కమిటీ వేశామన్నారు. కమిటీ సూచనల మేరకు పనులు మొదలవుతాయని చెప్పారు. కొత్తగా నిర్మించే ఆలయాన్ని మరింత పెద్దదిగా ఏర్పాటు చేయాలనేది అర్చక స్వాముల ఆకాంక్ష. గతంలో ఈ ఆలయం చిన్నదిగా ఉండేదని, అయినా భక్తులు ఎక్కువగా వచ్చేవారని, భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని వారు అధికారులకు సూచించారు.
ఈ ఆలయ నిర్మాణం ఆశించిన విధంగా సర్కారు సకాలంలో పూర్తి చేస్తే .. అనవసర రాజకీయ అలజడి తగ్గే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.