భగవంతుడి దృష్టిలో సకల మానవాళి సమానమే! భక్తులందరూ సమానమే. సామాన్య భక్తులు- ప్రత్యేక భక్తులు అనే వ్యత్యాసాలు దేవుని దృష్టిలో ఉండవు. కానీ, దేవుడి మీద పెత్తనం చేయడానికే తమ పదవులు వచ్చాయని భావించే పాలకమండళ్లకు మాత్రం ఉంటాయి. అధికార్లకు మాత్రం ఉంటాయి. తాజాగా.. తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో వారి వ్యవహార సరళిని గమనిస్తే మాత్రం మనకు ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.
పార్ట్ 1 : ఏం జరిగిందంటే..
మంగళవారం నాడు కొన్ని వేల మంది భక్తులను తిరుమల గిరులకు రానివ్వకుండా.. టీటీడీ అధికారులు తిరుపతిలోనే ఆపివేశారు. దీనికి వాళ్లు పద్ధతిగానే కారణం చెప్పుకున్నారు. తిరుమలలో అయిదురోజుల పాటు తిరుపతి/స్థానికులకు మాత్రమే దర్శనావకాశం కల్పిస్తామని.. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎవ్వరూ రావద్దని కొన్నిరోజుల ముందే ప్రకటించారు. అయితే ముందుగా టికెట్లు పొందిన వారిని మాత్రం అనుమతించారు. కొవిడ్ అనంతర సమయంలో.. అసలు తిరుమలలో దర్శనం టికెట్లనే విక్రయించడం లేదు. తిరుపతిలోనే టికెట్లు ఇస్తున్నారు. అవి ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ లో ముందే పొందిన వారు, లేదా, తిరుపతిలో టికెట్ కొన్న వారు మాత్రమే తిరుమలకు వెళ్లగలరు. కానీ- మంగళవారం పరిస్థితి గమనిస్తే.. తిరుపతిలో టికెట్ కౌంటర్లలో స్థానికులకు మాత్రమే వారి ఆధార్ కార్డుల్లో చిరునామా చెక్ చేసి మాత్రమే టికెట్లు విక్రయించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు తెలియకుండా తిరుపతి వరకు వచ్చేసిన వేల మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. తిరుపతిలో టికెట్లు అమ్మడం లేదు- తిరుమలకు అనుమతించడం లేదు. వీరంతా గొడవ చేశారు. కానీ… వారికి పరిష్కారం దొరకలేదు. అధికారులు కనికరించలేదు. దాదాపు అయిదువేల మంది ఇలా ఇబ్బంది పడ్డారు.
Must Read ;- తిరుమల పవిత్రతకోసం గర్జించిన నారా లోకేష్
పార్ట్ 2 : వాళ్లు మాత్రం చాలా స్పెషల్
ఇదే రోజున ఇంకో ఎపిసోడ్ జరిగింది. కడప జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి దాదాపు రెండువేల మందిని వెంటేసుకుని.. అన్నమయ్య మార్గంలో తిరుమలకు కాలినడకన వచ్చారు. వీరందరూ ముందస్తుగా టికెట్లు తీసుకున్న వారు కాదు. అయితే మొత్తం ఈ రెండు వేల మందిని మాత్రం.. అధికారులు దర్శనానికి అనుమతించారు.
ఇదే సమయంలో.. పాదయాత్రగా తిరుమలకు వస్తూ.. డ్రోన్ తో తమ కాలినడకను చిత్రీకరింపజేసుకుంటూ అమర్ నాధ్ రెడ్డి, ఆయన వెంట వచ్చిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహానికి మాత్రం టెంకిజెల్ల పడింది. డ్రోన్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, అందులోని ఫుటేజీ మొత్తం డిలిట్ చేశారు. కేసు కూడా నమోదు చేశారు. ఆగమ విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి.. డ్రోన్ వాడినందుకు ఈ మాత్రం స్పందించిన అధికారులు.. ఇలా అడ్డగోలుగా.. కాలినడకన వచ్చేసిన రెండు వేల మందికి ఎలా అనుమతులు కల్పించారో మాత్రం అర్థం కాని సంగతి.
ఎందుకు అడ్డుకోలేకపోయారు?
తిరుపతిలో అయిదువేల మందిని తిరుమలకు రానివ్వకుండా అడ్డుకున్న అధికారులు, ఈ రెండు వేల మంది విషయంలో ఏమీ చేయలేకపోయారా? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కాకపోతే.. తిరుమలకు కాలినడకన రావడానికి అలిపిరి, శ్రీవారిమెట్టు రెండు మార్గాలు ఉంటాయి. ఈ రెండు మార్గాల్లో పక్కా ఏర్పాట్లు, సెక్యూరిటీ, భద్రత వసతులు ఉంటాయి. అయితే కడపజిల్లా నుంచి ఉండే అన్నమయ్య మార్గంగా పిలిచే కాలినడక దారి.. వసతులు ఉండవు. దీన్ని బాగు చేయాలనేదే ఆకేపాటి డిమాండు. ఆ మార్గంలో వచ్చే వారిని అడ్డుకోడానికి కూడా వ్యవస్థ లేదు. అందువల్లనే.. వారంతా తిరుమల వచ్చేయగలిగారు. వచ్చేశారు సరే.. వారందరికీ దర్శన భాగ్యం కల్పించడం మాత్రం.. అధికారులు రాజకీయ ఒత్తిడికి లోబడి తీసుకున్న నిర్ణయంగానే ఇప్పుడు విమర్శల పాలవుతోంది.
దుయ్యబట్టిన చంద్రబాబు
టీటీడీ అధికారులు ద్వంద్వ వైఖరిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అధికారులు నిబంధనల్ని, ఆచారాల్ని కూడా తుంగలో తొక్కారని అన్నారు.
‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోంది. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య భక్తులను కొండపైకి అనుమతించకపోగా లాఠీఛార్జి చేయడం హేయం.
ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైసీపీ శ్రేణులు తిరుమల కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ, డ్రోన్లు ఎగురవేస్తుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నట్లు.?
స్వామి వారిని దర్శించుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందని గుర్తించాలి. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలి.’’
అని టీటీడీ వైఖరిని నిలదీస్తూ ఆయన తన ట్విటర్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు.
తప్పేమిటి?
భగవంతుని ఎదుట భక్తులందరూ సమానులే. టీటీడీ ఒక నిబంధన పెట్టిన తర్వాత.. దాన్ని విధిగా వారే ఆచరించి ఉండాలి. అలా కాకుండా.. స్థానికులను మాత్రం అనుమతిస్తామని చెప్పిన రోజు.. ముందుగా కొన్న టికెట్లు లేకుండా వచ్చిన రెండు వేల మందిని కేవలం పార్టీ వారు గనుక అనుమతించడం అనేది హేయమైన నిర్ణయం.
అచ్చంగా దేవుడి సేవలో తరించడానికి భక్తితో వచ్చిన వేల మంది భక్తులను కొండ ఎక్కనివ్వకుండానే అడ్డుకోవడం ఒక ఎత్తు కాగా.. నాయకుల ప్రాపకం కోసం, నాయకుల ముఖప్రీతికోసం వారి వెంట పాదయాత్రగా తరలివచ్చిన భక్తులకు పెద్దపీట వేసి.. వారికి దర్శనభాగ్యం కల్పించడం ఘోరం! కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ ఉన్నంత మాత్రాన.. నిబంధనలను అతిక్రమించే వారందరూ కూడా.. టీటీడీకి ప్రత్యేక భక్తులు అయిపోతారా? అనే ప్రశ్న ప్రజలనుంచి వినిపిస్తోంది.
Also Read ;- దేవుడైతే మాకేంటి? ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తాం..
అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోంది. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య భక్తులను కొండపైకి అనుమతించకపోగా లాఠీఛార్జి చేయడం హేయం.(1/3) pic.twitter.com/0uHFf5MCIN
— N Chandrababu Naidu (@ncbn) December 23, 2020











