తనకు టీపీసీసీ ఆధ్యక్ష పదవి రావటంపై వైసీపీ నాయకుడు,ఎంపీ విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెనుకున్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు నా కేసుల గురించి మాట్లాడుతుంటే తనకు నవ్వొస్తోందని రేవంత్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ న్యాయస్థానాల్లో ఉందని, దీనికి సంబంధించి ఏదైనా చెప్పాల్సింది ఉంటే కోర్టుకే చెబుతానన్నారు.
జగన్, విజయసాయిరెడ్డిలు 2011లోనే జైలుకెళ్లొచ్చారు
తనపై కేసులు 2016లో నమోదయ్యాయని, జగన్, విజయసాయిరెడ్డిలు 2011లోనే జైలుకెళ్లొచ్చారని అన్నారు. విజయసాయిరెడ్డి పేరు ఏయే కేసుల్లో, ఎక్కడెక్కడ రాసుందో పాపం ఆయనకు తెలియనట్టుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయసాయి లాంటి వారు అద్దంలో చూసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రేవంత్‌రెడ్డిని పీసీపీ అధ్యక్షుడిగా నియమించడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని విజయసాయి రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలని కొనేసి తెలంగాణలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖరెడ్డిది ఏ పార్టీ?
అంతే కాకుండా తనను ఉద్దేశించి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ స్పందించారు. తాను టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడినయ్యానని వైఎస్ షర్మిల అన్నట్టు వార్తల్లో చూశానని రేవంత్ తెలిపారు. మరి షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డిది ఏ పార్టీ? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ తొలుత రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారని, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారని గుర్తు చేశారు. అంతే కాకుండా ఏపీ సీఎం జగన్ తొలుత ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. వీళ్లందరూ పార్టీలు మారిన వారే కదా అని ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి ఎంపీగా గెలిచానని, పార్టీ కోసం తాను చేస్తున్న కృషిని గుర్తించిన అధిష్ఠానం తనకు పదవిన కట్టబెట్టిందని అన్నారు.
గాంధీభవన్‌కు వాస్తు మార్పులు
ఇదిలా ఉండగా గాంధీభవన్‌కు వాస్తు మార్పులు చేయనున్నారు. గాంధీభవన్ తూర్పులో మరో ద్వారం ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ చీఫ్ ఛాంబర్ తూర్పులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. గాంధీ భవన్‌లో పార్టీ జెండాలు అమ్మే గది సెక్యూరిటీ రూమ్‌ను తొలగించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే ఈ నెల 7వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని యోచనలో ఉంది.











