కథల కొరత అనే మాట సాధారణంగా సినిమా రంగంలో వినిపిస్తుంది. ఇలాంటి కొరతను తీర్చిన ఘనత చాలా మంది రచయితలకు దక్కుతుంది. ఎంతోమంది రచయితలు రాసిన నవలలు సినిమాలుగా మారి ఘనవిజయాన్ని అందుకున్నాయి. బెంగలీ రచయిచ శరత్ చంద్ర నుంచి తెలుగులో యుద్ధనపూడి సులోచనరాణి వరకు చాలామంది రచయితల రచనలు సినిమాలుగా వచ్చాయి. టాలీవుడ్ విషయానికొస్తే ఈ లిస్ట్ లో అందరికంటే ముందు వరుసలో ఉన్న రచయిత యండమూరి వీరేంద్రనాధ్. ఈయన రచించిన చాలా నవలలు సినిమాలుగా వచ్చాయి. బహుశా.. ఈ స్థాయిలో నవలలు సినిమాలుగా మారిన ఘనత యండమూరికి తప్ప, మరో తెలుగు రచయితకు దక్కదేమో.
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 15 యండమూరి నవలలు సినిమాలుగా వచ్చాయంటే.. వాటి ప్రాముఖ్యాన్ని, యండమూరి గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ యండమూరి రాసిన ఎన్నో నవలలపై రీసెర్చ్ లు జరుగుతుంటాయి. ఏదైనా పాయింట్ లేదా ఏదైనా మంచి కథ దొరికితే సినిమాగా మార్చడానికి నిత్యం ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు.
యండమూరి నవలల్ని ఎక్కువగా సినిమాలుగా తీసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్టయిన అభిలాష సినిమా యండమూరిదే. అభిలాష అనే నవల ఆధారంగా, అదే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక యండమూరి రాసిన డబ్బు టు దది పవర్ ఆఫ్ డబ్బు అనే పుస్తకం ఆధారంగా ఛాలెంజ్ సినిమా తీశారు
ఆఖరి పోరాటం, మరణ మృదంగం, రుద్రనేత్ర, రాక్షసుడు అనే నవలలు యండమూరి రాసినవే. ఆ నవలలన్నింటినీ, అదే పేరు మీద చిరంజీవి సినిమాలుగా తీశారు. వీటిలో ఒకట్రెండ్ తప్ప, దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ కూడా యండమూరి రచనే. అయితే ఈ లిస్ట్ లోంచి దొంగ మొగుడు సినిమాకు మాత్రం చిన్న మినహాయింపు ఇవ్వాలి. దొంగ మొగుడు సినిమాకు యండమూరి పనిచేశారు. కానీ అది ఆయన రచన మాత్రం కాదు. అయితే సినిమా రిలీజైన తర్వాత దొంగమొగుడు స్ఫూర్తితో నల్లంచు తెల్లచీర అనే నవల రాశారు యండమూరి. పాత్రలు, కథ విషయంలో తేడాలు కనిపించినప్పటికీ.. దొంగమొగుడులో ఆత్మ, నల్లంచు తెల్లచీరలో ఆత్మ ఒకటే.
ఇక యండమూరి రాసిన సూపర్ హిట్ నవల వెన్నెల్లో ఆడపిల్ల. ఈ నవల ఎంత హిట్టయిందో 80లనాటి పాఠకుల్ని అడిగితే గంటలు గంటలు చెబుతారు. ఇక తులసీదళం నవల తెలుగు సాహిత్యంలో ఓ సంచలనం. ఈ రెండు నవలలు సినిమాలుగా వచ్చాయి. తులసీదళం అదే పేరుతో సినిమాగా రాగా.. వెన్నెల్లో ఆడపిల్ల నవల హలో ఐ లవ్ యు అనే సినిమాగా వచ్చింది.
వీటితో పాటు అగ్నిప్రవేశం, ఆఖరిపోరాటం, తులసి, థ్రిల్లర్, అంతర్ముఖం, దుప్పట్లో మిన్నాగు నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి. తులసి నవల కాష్మోరాగా తెరకెక్కగా.. థ్రిల్లర్ అనే నవల ముత్యమంత ముద్దుగా, అంతర్ముఖం అనే నవల సంపూర్ణ ప్రేమాయణం అనే సినిమాలుగా వచ్చాయి. వీటిలో అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు సినిమాలకు యండమూరి స్వయంగా దర్శకత్వం కూడా వహించారు.
ఇప్పటికీ యండమూరి రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు రచనలు సాగిస్తూనే, మరోవైపు సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన నల్లంచు తెల్లచీర అనే సినిమా త్వరలోనే విడుదలకాబోతోంది.











