సంక్రాంతి బరిలో ఉన్న రవితేజ మాస్ మసాలా మూవీ ఎట్టకేలకు రాత్రి విడుదలైంది. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు సాయంత్రం వరకూ ఎదురు చూసి ఎట్టకేలకు ఊపిరిపీల్చుకున్నారు. మాస్ మహారాజ రవితేజ, శ్రుతి హాసన్ జంటగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పోలీస్ ఆఫీసర్ పోతరాజు వీరశంకర్ గా రవితేజ నటించాడు. ఈ సినిమా ఎలా ఉంది? జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.
కథలోకి వెళితే..
ఒంగోలు నేపథ్యంలో సాగే కథ ఇది. పోతరాజు వీరశంకర్ (రవితేజ) పోలీస్ ఆఫీసర్. నేరగాళ్ల దృష్టిలో అతనో క్రాక్. సాధారణంగా ఇలాంటి పోలీస్ ఆఫీసర్లకు ట్రాన్స్ ఫర్లే వస్తుంటాయి. అతను ఎక్కడికి వెళ్లినా నేరగాళ్లతో గొడవే. కడప, కర్నూల్, ఒంగోలు.. ఇలా మూడు చోట్లకు మారి ముగ్గురు రౌడీలతో పెట్టుకుంటాడు. వాళ్ల ఆటను ఇతను ఎలా కట్టించాడన్నదే కథ. ఈ ముగ్గురిలో ఒకడు సలీమ్ (చిరాగ్ జానీ) తీవ్రవాది. కర్నూలు ఎస్.ఐ. గా ఉన్నప్పుడు అతను వీరశంకర్ చేతికి చిక్కుతాడు.
ఇక రెండో వాడు కడప రెడ్డి (రవి శంకర్) ఫ్యాక్షన్ లీడర్. ఇతడిది మామిడి కాయల నేపథ్యం. ఇక మూడో వాడు కటారి కృష్ణ (సముద్ర ఖని) ఒంగోలు గిత్తా లాంటోడు. అతని చేయని నేరం ఉండదు. మోస్ట్ డేంజరస్ అయిన ఇతడిని వీర శంకర్ ఎదుర్కోవడమే ఈ కథకు క్లైమాక్స్. వీరి ముగ్గురిలో కటారి (చాలా బలవంతుడు. హీరోని చంపడానికి ఎంతకైనా తెగించే తత్వం. చెడుపై మంచి సాగించే పోరాటమే ఈ కథ. ముఖ్యంగా కటారిని వీరశంకర్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే ఈ కథలో కీలక అంశం. శ్రుతి హాసన్ ను భార్యగా చూపించి కుటుంబ కథగా ప్రారంభించి దీన్ని కొనసాగించారు. తిక్క పోలీసోడికి కిక్కు ఎక్కితే ఎలా ఉంటోందో ఇందులో చూడవచ్చు. వీర శంకర్ గా రవితేజ చెలరేగిపోయాడు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
వీర శంకర్ మాస్ అప్పీల్ మనకు తెలియంది కాదు. మళ్లీ ఇది వన్ మ్యాన్ షో అనుకోవాల్సిందే. మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా దర్శకుడు దీన్ని టార్గెట్ చేశాడు. కథని మొదలు పెట్టే విధానంలోనే దర్శకుడు కొంచెం తడబడ్డాడు. హీరోని క్రాక్ పోలీస్ ఆఫీసర్ గా ఎలివేట్ చేయడానికి ప్రయత్నం జరిగింది. కొత్తదనం కోసం గోపీచంద్ మలినేని ప్రయత్నం చేశాడు. కథని కొంత ట్రిమ్ చేస్తే ఇంకాస్త మెరుగ్గా అనిపించేది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్సయ్యింది. శ్రుతిహాసన్ లాంటి హీరోయిన్ ని పెట్టాం కాబట్టి ఆమె కోసం కొన్ని సీన్లు రాసుకున్నట్టుంది. ఆ సన్నివేశాలు విసిగించే వరకూ వెళ్లాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తి కలిగేలా దర్శకుడు క్రియేట్ చేయగలిగాడు.
కటారి పాత్రలో సముద్ర ఖని తనదైన శైలిలో మెప్పించాడు. క్లైమాక్స్ ను కూడా వైవిధ్యంగా చూపగలిగారు. రవితేజలో మునుపటి ఛార్మ్ ఏమాత్రం తగ్గలేదు. శ్రుతి హాసన్ కూడా చాలా పేలవంగా కనిపించింది. కటారి కృష్ణ కు సెకండ్ సెటప్‌గా జయమ్మ పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించింది. తెలుగులో ఆమెకు ఇది మంచి పాత్రగానే చెప్పాలి. కానిస్టేబుల్‌గా నటించిన సుధాకర్ కు కూడా ఇందులో ఓ కీ రోల్ ఉంది. ఇక కత్తి మహేష్ ఇందులో నవ్వు పాత్రలో కనిపిస్తాడు. ఉన్నది రెండుమూడు సీన్లే అయినా పండాయి. అతన్ని రవితేజ కొట్టే సన్నివేశాలు రక్తికట్టాయి. మొత్తానికి ఇతనికి కులం తాలూకు పాత్రే ఇచ్చారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు కూడా ఇందులో నటించాడు. రవితేజకు కొడుకుగా నవ్వించాడు. ‘నాన్నా.. రాత్రి బెడ్ రూంలో పడుకుంటున్నా.. ఉదయానికి హాలులోకి ఎలా వస్తున్నా’ అని తండ్రిని అడిగే సీన్లలో రవితేజ రియాక్షన్ చూడాల్సిందే. అలీది మాత్రం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే. ఫైట్ మాస్టర్లు తమ ప్రాంతంలో సాగే కథాంశం కాబట్టి ఓన్ చేసుకున్నట్టున్నారు. యాక్షన్ పీక్స్ లో కనిపిస్తుంది. ఒంగోలు బస్టాండ్ ఫైట్.. క్లైమాక్స్‌లో బీచ్ ఫైట్.. రక్తి కట్టించాయి. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. అప్సర రాణి ఐటమ్ సాంగ్ కేవలం మాస్ ప్రేక్షకుల కోసమే పెట్టినట్టుంది.
హైలైట్స్:
యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయి. రవితేజకు ధీటైన విలన్ గా సముద్రఖని మెప్పించాడు. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. విజువల్స్ బాగున్నాయి. పాటలు, రీరికార్డింగ్ కు మంచి మార్కులు వేయవచ్చు. మాస్ మసాలా కోరుకునే రవితేజ అభిమానులకు కావలసిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. తమన్ మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది. గత ఏడాది సంక్రాంతి హిట్ తమన్ కు లభించినట్టుగానే ఈసారి కూడా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయినట్టుంది.
నటీనటులు: రవితేజ, శ్రుతిహాసన్, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‍కుమార్, సుధాకర్, వంశీ, రవి శంకర్, సప్తగిరి.
మాటలు: సాయి మాధవ్ బుర్రా
సంగీతం: తమన్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
బ్యానర్: సరస్వతి ఫిలిం డివిజన్
నిర్మాత: బి. మధు
కథ, కథనం, దర్శకత్వం: గోపిచంద్ మలినేని
ఒక్క మాటలో: సంక్రాంతి బిర్యానీ
రేటింగ్: 3.5/5
– హేమసుందర్ పామర్తి











