పాట ఆయన స్వరంలో పుట్టడానికి ఇష్టపడుతుంది .. పాట ఆయన స్వరాల ఊయలలో ఊగడానికి ఉత్సాహపడుతుంది .. పాట ఆయన స్వరాల సామ్రాజ్యంలో విహరించడానికి ఆసక్తిని చూపుతుంది. మంత్రముగ్ధులను చేసే మధురమైన ఆ స్వరం పేరు .. ఇంద్రాదిదేవతలను ఇలకు దింపే ఆ గంధర్వ గానం పేరు .. కేజే ఏసుదాసు.
మధురమైన పాట మనసుకు ఊరటనిస్తుంది .. ఉత్సాహాన్ని కలిగిస్తుంది .. ఊహల్లో తేలియాడిస్తుంది. హృదయానికి రెక్కలు తగిలించి అనుభూతుల ఆకాశంలో ఎగరేస్తుంది .. ఆవేదన అంచుల్లో కొత్త చివుళ్లు పూయిస్తుంది. అలాంటి మధురమైన పాటలకు .. మనసును మథించే పాటలకు పుట్టినిల్లుగా ఏసుదాసు స్వరం కనిపిస్తుంది. అది సంగీత సంద్రంలోని సరిగమల తరంగాలను వీనుల విందుగా వినిపిస్తుంది.
ఏసుదాసుకి చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అంటే ఇష్టం .. పాట అంటే ప్రాణం. సంగీతం తన ఆకలి తీరిస్తే, పాట తన దప్పిక తీర్చుతుందని ఆయన భావిస్తారు. అందువల్లనే తండ్రి చనిపోయినా .. ఆర్ధికంగా అండగా నిలిచేవారు లేకపోయినా .. పేదరికం పెత్తనం చేస్తున్నా ఆయన తన సంగీత సాధనను ఆపలేదు. సంగీతం పట్ల తనకి గల పట్టుదలను .. ప్రేమను పక్కన పెట్టలేదు. ఒక రుషిలా తన తపస్సును కొనసాగిస్తూనే వచ్చారు. అందువల్లనే ఆయనను చూసినప్పుడు మనకి ‘మహర్షి’లానే అనిపిస్తారు .. గాన గంధర్వుడిగానే కనిపిస్తారు.
ఏసుదాసు పాటలా ఆయన జీవితం హాయిగా .. ఆనందంగా సాగలేదు. ఎన్నో కష్టాలు .. మరెన్నో అవమానాలు .. ఇంకెన్నో విమర్శలు ఆయన కెరియర్లో కనిపిస్తాయి. కొంతమంది ఆయనకి, అవకాశాన్ని అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. మరికొంతమంది ఆయన వాయిస్ సినిమా పాటలకి పనికిరాదని చెప్పేశారు.అయినా ఆయన కుంగిపోలేదు .. ఆవేదనతో ఆగిపోలేదు. సూర్యచంద్రులకే గ్రహణం తప్పడం లేదు .. కడలికే ఆటుపోట్లు తప్పడం లేదు .. అనుకుంటూ పాట చేతబట్టుకుని ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు.
Must Read ;- లిటిల్ ఛాంపియన్ టు ఇండియన్ ఐడల్.. ‘షణ్ముఖ ప్రియ’..
ప్రయత్నాన్ని బట్టే ఫలితం ఉంటుంది .. సాధనను బట్టే విజయం ఉంటుంది అనేది ఏసుదాసు విషయంలో మరోసారి నిజమైంది. కేరళకి చెందిన దర్శకుడు ఏకే ఆంథోని ఆయనకి తొలిసారిగా అవకాశం ఇచ్చారు. 1961లో ఒక సినిమా కోసం తొలిసారిగా రికార్డింగ్ థియేటర్లో పాడిన ఏసుదాసు, ఒక్కో పాటను ఒక్కో మంత్రంలా ప్రయోగించి మనసు మందిరాలలో నివాసం ఏర్పరచుకున్నారు. అభిమానులంతా కూడా తమ గుండె గదులను ఖాళీ చేసేసి, ఆయన స్వరంలోని మాధుర్యానికీ .. ఆర్ద్రతకి అప్పగించేశారు.
ఏసుదాసు స్వరం ప్రతి హృదయాన్ని స్పర్శించింది .. ప్రతి అనుభూతిని దర్శింపజేసింది. ఎల్లలు దాటిన ఆయన స్వరం మారుమూల మనసులను సైతం తాకింది .. గుండె గోడలను తాకుతూ మల్లెతీగలా పాకింది. అలా ఆయన దాదాపు 14 భాషల్లో 80 వేలకి పైగా సినిమా పాటలు పాడారు. ప్రైవేట్ పాటలను కలుపుకుంటే లక్షకి పైమాటే. ఎన్నో సినిమాల విజయం వెనుక ఆయన స్వరం ప్రధాన పాత్రను పోషించింది. వివిధ భాషల్లోని స్టార్ హీరోలు ఆయన పాట కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతగా ఆయన గానం ప్రవహించింది .. ప్రభావితం చేసింది.
Also Read ;- పాటకు పెద్ద పీట వేసిన మర్యాద రామన్న ‘బాలు’
తెలుగు సినిమాల విషయానికే వస్తే, తన స్వర సముద్రం నుంచి వెలువడిన ఎన్నో ఆణిముత్యాలను ఆయన ప్రేక్షకుల హృదయ తీరాల్లో ఆరబోశారు. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి’ .. ‘వేగుచుక్క పొడిచింది’ .. ‘ముసిముసి నవ్వులలోన’ .. ‘ఇదేలే తరతరాల చరితం’ .. ‘కదిలే కాలమా’ .. ‘స్వరరాగ గంగా ప్రవాహమే’ .. ‘పచ్చని చిలకలు తోడుంటే’ .. ‘ఆకాశదేశాన’ .. ఇలా ఎన్నో మధురమైన పాటల పరిమళాలను వెదజల్లారు. గాయకుడిగా ఆయన విశ్వరూపానికి ‘స్వరరాగ గంగా ప్రవాహమే’ సరిపోతుందేమో. ఆయన స్వరానికీ .. అది అందించే అనుభూతికి అవధులు లేవనిపిస్తుంది. ఇక ‘మేఘ సందేశం’ సినిమాలో తెరపై అక్కినేని హీరోగా కనిపిస్తున్నప్పటికీ, పాటల పరంగా మరో హీరోలా ఏసుదాసు అనిపించడం విశేషం.
ఇక సినిమా పాటల పరంగా ఆయనకి ఎంత పేరు ఉందో, భక్తిపాటల పరంగా కూడా అంతే పేరు ఉంది. ముఖ్యంగా అయ్యప్ప దీక్షల సమయంలో ఆయన పాడిన ‘అయ్యప్ప పాటలు’ వినిపించని మంటపాలుకానీ .. ఆయన పాటలు పాడుకోని భక్త బృందాలుగాని కనిపించవు. శబరిమలై ప్రధాన ఆలయంలోను ‘పవళింపు సేవ’ నిమిత్తం ఆయన పాడిన ‘హరివరాసనం’ అనే పాటనే స్వామివారికి వినిపించడం ఆయనకి మాత్రమే దక్కిన మహద్భాగ్యం.
దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న స్వర ప్రయాణానికి తగిన గుర్తింపుగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు .. కేంద్రప్రభుత్వం అనేక పురస్కారాలతో సత్కరించాయి. ‘పద్మశ్రీ’ .. ‘పద్మభూషణ్’ .. ‘పద్మ విభూషణ్’ పురస్కారాలు ఆయన స్వరాల రాజధానికి చేరిపోయాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తూ ప్రవాహం ముందుకు సాగిపోతూనే ఉంటుంది .. అలాగే ఏసుదాసు కూడా. ఆయన గానం స్వరరాగ గంగా ప్రవాహం .. ఆ ప్రవాహంలో ప్రతి మనసు తడిసిపోవాలి .. ప్రతి హృదయం మురిసిపోవాలి .. అనుభూతి పరిమళంతో ఐక్యమైపోవాలి. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Also Read ;p నిజంగా ఇది చాలా బాధాకరమన్న ఘంటసాల తనయుడు
— పెద్దింటి గోపీకృష్ణ