గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి సంబంధించి మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నా.. కొత్త రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఏ ఒక్కరూ ఊహించనంత దూకుడుతో సాగుతోంది. పార్టీని వీడిన కీలక నేతలు తిరిగి పార్టీలోకి చేరేలా సాగుతున్న పార్టీ స్పీడుకు.. టీపీసీసీ చీఫ్ గా ఇటీవలే ఎంపికైన రేవంత్ రెడ్డే కారణమని చెప్పక తప్పదు. అప్పటిదాకా నిస్సత్తువగా, గ్రూపు తగాదాలతో సాగిన పార్టీలో రేవంత్ రెడ్డి నిజంగానే జోష్ నింపారని చెప్పాలి. టీపీసీసీ పగ్గాలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగిపోయిన రేవంత్ రెడ్డి.. వరుసపెట్టి బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రత్యర్థి పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నారని చెప్పక తప్పదు. అంతేనా.. నీరసించిపోయిన పార్టీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారని కూడా చెప్పాలి. ఈ క్రమంలో పార్టీకి సంబంధించి జరిగిన ఓ సమావేశంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైనం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈ ప్రసంగం రాజకీయ పండితులను కూడా మెస్మరైజ్ చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ ముగ్గురి స్మరణలో..
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న రేవంత్ రెడ్డి.. వైరివర్గాలకు చెందిన నేతలను మాత్రం ఏకిపారేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో శనివారం నాటి ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుల పేర్లను కూడా ప్రస్తావించిన రేవంత్.. వారి సత్తాను ఆకాశానికెత్తేశారు. తెలుగు నేల రాజకీయాల్లో ఈ ముగ్గురిని మించిన నేతలు లేరన్న కోణంలో ఆయన ప్రసంగం సాగింది. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసింది. చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారే. వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలను యూత్ కాంగ్రెస్ అందించింది. ఆ ముగ్గురు నేతల మాదిరి నేతలను మనం తయారు చేయలేమా?’’ అని రేవంత్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఈ ముగ్గురు నేతలను సత్తా కలిగిన నేతలుగా రేవంత్ గుర్తించినట్టైంది.
టీడీపీ చీఫ్ గా బాబు.. టీఆర్ఎస్ చీఫ్ గా కేసీఆర్
వాస్తవానికి ఇటు వైఎస్సార్ అయినా, అటు కేసీఆర్, చంద్రబాబు అయినా.. ముగ్గురూ కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. అయితే వైఎస్సార్ తన మరణం వరకూ పార్టీలోనే కొనసాగితే.. చంద్రబాబు, కేసీఆర్ లు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ అధినేతగా కొనసాగుతుండగా.. టీడీపీ నుంచి కూడా బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ అధినేతగానే కాకుండా తెలంగాణకు సీఎంగా కొనసాగుతున్నారు. అయితే రాజకీయ వ్యూహాల రచనలో ఈ ముగ్గురు కూడా ఒకరిని మించిన సమర్థులు మరొకరు. ఉమ్మడి రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు తెలుగు నేల విభజన తర్వాత ఏపీకి ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. ఇక విపక్ష నేతగానూ ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు, ఆ తర్వాత ప్రస్తుతం ఏపీలోనూ విపక్ష నేతగా సాగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి తెచ్చిన నేతగా ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక కేసీఆర్ అయితే.. తన పోరాటాలతో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకుని, దానికి తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి.. వరుసగా రెండో పర్యాయం కూడా ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నారు. మరి రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురి స్థాయి నేతలను తయారు చేస్తుందా? అన్నది కాలమే నిర్ణయిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.