తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఎంత కట్టడి చేయాలని ప్రయత్నించినా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా గంజాయి విపరీతంగా సరఫరా అయ్యేది. దాన్ని ఎలాగొలా అదుపు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. డ్రగ్స్ సమస్య మాత్రం చాలా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సమర్థులైన అధికారులను రంగంలోకి దింపింది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కూడా డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
డ్రగ్స్, గంజాయిని నియంత్రించాలని చంద్రబాబు ప్రభుత్వం ఒక సమర్థుడైన అధికారి కోసం అన్వేషించింది. ఇప్పుడు ఆయన్ను ఏపీకి రప్పిస్తోంది. ఆ అధికారి ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనే ఆకే రవికృష్ణ. డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడం కోసం చంద్రబాబు ఈయన్ను ఎంపిక చేసుకున్నారు. పోలీసు అధికారి రవికృష్ణను ఏపీకి పంపించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు అడగడమే ఆలస్యం.. కేంద్రం రవికృష్ణను సొంత క్యాడర్‌కు పంపించేందుకు రెడీ అయింది. అందుకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా తెలిపింది.
కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై ఏపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ మరో రెండు రోజుల్లో ఏపీకి రాబోతున్నారు. ఇప్పుడు రవికృష్ణను చంద్రబాబు ఏపీలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఉపయోగించనున్నారు. చంద్రబాబు సర్కార్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి.. దీనికి చీఫ్ గా రవికృష్ణను నియమించబోతోంది.
రవికృష్ణ ట్రాక్ రికార్డ్ కూడా బాగా ఉంది. ఆయన 2006 బ్యాచ్ కు చెందిన ఐజీ క్యాడర్ అధికారి. గతంలో ఆయన చింతపల్లి, పార్వతీపురం, వనపర్తి ఏఎస్పీగా, కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. జిల్లాల విభజన జరగకముందు ఉమ్మడి కర్నూలు, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కడా పని చేశారు. 2018 నుంచి డిప్యుటేషన్ పై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేస్తున్నారు. తాను పని చేసిన ప్రతిచోట వివిధ నేరాల నియంత్రణలో రవికృష్ణ తనదైన ముద్ర వేశారు.











