ఆంధ్రా రాజకీయాల్లో వివాదాస్పదమైన మహిళా నేతగా పేరు తెచ్చుకున్న రోజాకు ఇక ఇక్కడ రాజకీయ భవిష్యత్తు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె ఉన్న వైఎస్ఆర్ సీపీ సమీప భవిష్యత్తులోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా నిలబడే అవకాశం లేకపోవడంతో ఇక రోజా ఏపీ రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. రెండోసారి మంత్రిగా అత్యంత వివాదాస్పదమైన నేతగా రోజా పేరు తెచ్చుకున్నారు. ఆమె నోరు మోరీ అనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. ఇక నగిరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించిన సంగతి తెలిసిందే. అలాంటి రోజాకు ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంలో కూడా తిరిగి నిలదొక్కుకునే పరిస్థితి కనిపించడం లేదు.
అందుకే రోజా మెట్టినిల్లు అయిన తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆమె భర్త సెల్వమణి సొంత రాష్ట్రం అయిన తమిళనాడు పాలిటిక్స్‌పై రోజా ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయం మీద సన్నిహితులతో చర్చ చేస్తున్నట్లు సమాచారం. పైగా ఈ మధ్య రోజాఎక్కువగా తమిళనాడులోని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్నట్లు చెబుతున్నారు. సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉండడమే కాక, తమిళం కూడా అనర్గళంగా మాట్లాడతారు. దీంతో తన సినీ గ్లామర్‌తో తమిళనాడులో రాణిస్తానని రోజా భావిస్తున్నట్లు సమాచారం.
అయితే, ఇళయదళపతి విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం పార్టీలో రోజా చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం.. ఈలోపు పార్టీలో చేరి కీలక పదవులు పొందాలనే ఆలోచనలో రోజా ఉన్నట్లు చెబుతున్నారు. అలా క్రియాశీల పదవి తీసుకొని, ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో రోజా పోటీ చేస్తారని అంటున్నారు.
గత రెండేళ్లుగా ఆమె మంత్రి హోదాలో ఉన్నప్పటికీ నగరి నియోజకవర్గంలో చాలా గడ్డు పరిస్థితులు రోజా ఎదుర్కొన్నారు. ఇదంతా ఆమె నోటి దూల, సొంత నేతల్ని పక్కకు నెట్టడం, కారణంగానే జరిగిందనే అభిప్రాయం ఉంది. అదుకే సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేసి.. ఆమెను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసి అన్నంత పనీ చేశారు. భవిష్యత్‌లోనూ రోజాకు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు దాదాపు లేవు. కాబట్టే, ఏపీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరి ఏపీలో ఓ మంచి మహిళా నేతగా సంపాదించలేదని పేరు అక్కడ ఏ మాత్రం తెచ్చుకుంటారనే పలువురు కామెంట్ చేస్తున్నారు.











