మంగళగిరి పట్టణంలో ఎక్కువగా చేనేత కార్మికులు, గోల్డ్ స్మిత్‌లు ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా అక్కడ ప్రజలు టీడీపీ కంటే కాంగ్రెస్‌కు ఆ తర్వాత వైఎస్ఆర్ సీపీకే పట్టం కడుతూ వచ్చారు. కానీ, వారి వల్ల మంగళగిరి మార్చేలా, అక్కడి కార్మికులకు మేలు చేసేలా ఏ మంచి పని ఎవరూ చేయలేకపోయారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అంతే ఉంటున్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మంగళగిరి ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. గతానికి భిన్నంగా మంగళగిరిలో ఇప్పుడు టీడీపీకి చెందిన లీడర్, అందులోనూ మంత్రి నారా లోకేశ్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే ఆయన మంగళగిరి ప్రజల దశ దిశ మార్చేలా ఎన్నో మార్పులతో ముందుకు వస్తున్నారు.
మంగళగిరిని దక్షిణ భారతదేశంలోనే ఒక గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తాజాగా నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరి పట్టణంలో అత్యధికంగా ఉన్న స్వర్ణకారులు, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అధునాతన ఆకృతులు, ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలనూ లోకేశ్ నెరవేరుస్తారని ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా మాట ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.
కేవలం మాటలే కాదు.. పనులను కూడా నారా లోకేశ్ చేసి చూపిస్తున్నారు. మంగళగిరిలోని భద్రావతి సమేత భావనా రుషి ఆలయ కల్యాణ మండపాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి నూతన వస్త్రాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఈ సమయంలోనే నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మంగళగిరిని సౌత్ ఇండియాలోనే ఒక గోల్డ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా నారా లోకేశ్ వెల్లడించారు.
ఇప్పటికే నారా లోకేశ్ అందరు ఎమ్మెల్యేల తరహాలో కాకుండా తనదైన రీతిలో మంగళగిరిపై ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా తన ఇంటి వద్దనే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను తీర్చుతున్నారు. అధికారంలోకి వచ్చేశాం కదా అని సేద తీరకుండా.. ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి లోకేశ్ ప్రజా సేవలో నిమగ్నమై పని చేస్తున్నారు. ఇలా లోకేశ్ ఎల్లప్పుడు ప్రజల మధ్యనే ఉండడంతో మంగళగిరి ప్రజల్లోనూ భవిష్యత్తుపై ఆశలు పెరుగుతున్నాయి. వారి ఆశలకు తగ్గట్లుగానే పని చేస్తానని లోకేశ్ వారికి మాట ఇస్తున్నారు.











