విశాఖపట్నంపై ఓ గద్ధ వాలింది. అది తన డ్రోన్ కళ్లతో మొత్తం స్కాన్ చేసేస్తోంది. కొండ మీద కూర్చుని..కింద ఉన్న భూములను నోట్ చేసుకుంటోంది. ఏ భూమిని ఎలా లాక్కోవాలో.. ప్లాన్ చేసుకుంటుంది. అందులో ఏమైనా తేడా ఉంటే ముందు నోటీసు.. నోటీసుకే స్పందించి క్యాండేట్ పరిగెత్తుకొచ్చాడా.. ఓకె… డీల్ మాట్లాడేసుకుంటుంది. కాదు కూడదు అని మొరాయించాడా..కూల్చివేతలు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే భూమి లాగేసుకుంటారు.. పైసా ఇవ్వకుండా. ఇదే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో జరుగుతోంది. వందల, వేల ఎకరాలపై ఆ గద్ధ వాలిపోతోంది. నిద్ర కూడా పోకుండా 24 గంటలూ అదే పనిలో ఉంటూ… అక్కడ ఎవరికీ నిద్ర లేకుండా చేస్తోంది.
నోటీసుకు స్పందించి..
దసపల్లా. ఇది ఆ గద్ధ నోటీసుకు స్పందించి పరిగెత్తుకొచ్చిన కోడిపిల్ల. డీల్ ఓకె చేసేసుకుంది. 22ఎ కింద ఇరుక్కుపోయిన తన ల్యాండ్‌ను బయటకు తెమ్మంది.. తెస్తే గద్దకు వాటా ఎంతో.. తనకు వాటా ఎంతో మాట్లాడుకుంది. ఇక అధికారపార్టీ అధిష్టాన నేత అయిన ఆ గద్ధ పావులు కదిపింది. ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్‌మెంట్లలో ఫైలు గిరగిరా తిప్పేసింది. కోర్టులో మాత్రం ఫైలు కదలకుండా చేసేలా అధికారులను నడిపించింది. దీంతో కోర్టులో కేసు దసపల్లా గెలిచేసింది. అవతల నుంచి కౌంటర్ లేకపోతే కోర్టు మాత్రం ఏం చేస్తుంది. అలా దసపల్లాకు భారీ లాభం ఇచ్చినట్లే ఇచ్చి… తన లాభం తాను గుంజుకుంది అధికార గద్ద.
దసపల్లాకు కాస్ట్ లీ హెల్పింగ్ హ్యాండ్..
ఇక దసపల్లాకు కాస్ట్ లీ హెల్పింగ్ హ్యాండ్ అందించేశారు అధికార పార్టీ నేతలు. డెవలప్‌మెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అక్కడ ప్లాట్లు కొన్నవాళ్లు ఉన్నా సరే…వాళ్లను ఒప్పించే బాధ్యత కూడా అధికార పార్టీ నేతలతే. ఒప్పించేముంది..చెప్పాక ఒప్పుకోకపోతే ఏం జరుగుతోంది విశాఖ జనాలకు ఇప్పటికే అర్ధమైపోయింది. అందుకే కిమ్మనకుండా ఓకెలు చెప్పేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో 30 శాతం వాటా అధికార పార్టీ నేతలకు చేరుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఓపెన్‌గా ఇంత వ్యవహారం నడుస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం ఏమీ తెలియనట్లే అంతా చూస్తూ కూర్చున్నారు. ఎందుకంటే అడ్డుపడితే ఏం జరుగుతుందో తెలుసు.. అందుకే నోరు మూసుకుని ఇచ్చింది తీసుకుని గమ్ముగా కూర్చున్నారు.
బతుకుజీవుడా అంటూ..
ఇప్పటి వరకు విశాఖలో అక్రమాలు, కబ్జాలు అనే పేరుతో తెలుగుదేశం నేతల భూములపై దాడులు చేస్తున్న అధికారులు.. వారికి డైరెక్షన్ ఇస్తున్న అధికార పార్టీ అధిష్టాన నేత…ఇలా డీల్స్ కుదుర్చుకోవడంతో.. నగరంలో వణికిపోతున్న బడా వ్యాపారవేత్తలకు ఓ మార్గం చూపించినట్లయింది. వారు కూడా పెద్ద మొత్తంలో వాటా వదులుకుని.. బతుకు జీవుడా అంటూ బతికేయడం బెటరని డిసైడైపోతున్నారు. డీల్ లో వాటాల విషయంలో ఎంత బేరం ఆడి ఒప్పించుకుంటే అంత మిగులుతుందని మానసికంగా సిద్ధపడిపోతున్నారు.
అధికార పార్టీ అధిష్టాన నేత మాత్రం కంప్యూటర్ల ముందు కూర్చుని.. ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి..ఎక్కడెక్కడ కీలక నిర్మాణాలు జరిగాయో మొత్తం డేటా లాగుతున్నారు. ఆ డేటా ప్రకారం ఒక్కో ప్రాపర్టీపై ఒక్కో వ్యూహం అమలు చేస్తూ..మొత్తం సాగర తీరాన్ని క్రమంగా కబ్జా చేసేస్తున్నారు.