టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలను నిజంగానే చెడుగుడు ఆడుకున్నారనే చెప్పాలి. శనివారం ఉదయం అనూహ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడులను కలిసిన రేవంత్ రెడ్డి.. రాత్రయ్యే సరికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ లో ప్రత్యక్షమయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ నేతృత్వంలోని బిగ్ డీబేట్ లో తనదైన శైలిలో తన భవిష్యత్ వ్యూహాలను వెల్లడించిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీపైనా, ఆ పార్టీ కీలక నేతలపైనా మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక స్వల్పంగా అయినా ఏపీ వ్యవహారాలపై కూడా మాట్లాడిన రేవంత్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైని తనదైన శైలి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరవీరుల స్థూపం కాంట్రాక్టర్ కడప జిల్లా వాసి
టీఆర్ఎస్ పాలన తీరుపై తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను కాంగ్రెస్ పార్టీ బద్దలు కొడుతుందని పంచ్ డైలాగ్ సంధించారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు ప్రభుత్వ వ్యవహారాల్లో తలమునకలై అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏ పనిలో వారు అవినీతికి పాల్పడినా ప్రజలు పెద్దగా పట్టించుకోని.. తెలంగాణ ఏర్పాటుకు కీలక స్తంభంగా నిలిచిన అమరవీరుల త్యాగాన్ని స్మరించుకునేందుకు ఏర్పాటు చేయదలచిన అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ మంత్రి కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ స్తూపం నిర్మాణ కాంట్రాక్టును ఏపీలోని కడప జిల్లా కాంట్రాక్టరుకు ఇచ్చారని కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రిపై అంతగా ప్రత్యేక దృష్టి సారించే కేసీఆర్… అమరవీరుల స్థూపంపై ఎందుకు పెట్టడం లేదని కూడా రేవంత్ ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు కేవలం టీఆర్ఎస్, ఈటల రాజేందర్ ల మధ్యనే జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదో సాధిస్తుందని తాను భావించడం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే హుజూరాబాద్ ఎన్నికకు కేసీఆర్ రూ.200 కోట్లు ఖర్చు పెడుతుంటే.. ఈటల కూడా రూ.200 కోట్లతో బరిలోకి దిగుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో అవినీతి తారా స్థాయికి చేరిందని, అందులో కేటీఆర్ పాత్ర ముఖ్యమని… ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు బొంద పెడతారని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డికి ఖండించే దమ్ముందా?
ఇక బీజేపీపైనా తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ పంపిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చిన కిషన్ రెడ్డి… ఈటలతో చర్చలు జరిపారని.. ఇది పచ్చి నిజమని రేవంత్ ఆరోపించారు. ఈ విషయంలో తన మాట తప్పని దమ్ముంటే కిషన్ రెడ్డి స్వయంగా ఖండించాలని కూడా రేవంత్ ఏకంగా పెను సవాలే విసిరారు. తెలంగాణలో బీజేపీకి అంత సీను లేదని చెప్పిన రేవంత్… అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే పోటీ సాగుతుందని, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడించి తీరుతుందని కూడా రేవంత్ ప్రకటించారు. ఇక ఏపీ విషయాలను అలా టచ్ చేసిన రేవంత్… తనకు పీసీసీ పదవి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుణ్యమేనన్న విజయసాయిరెడ్డి ఆరోపణలను ప్రస్తావిస్తూ.. కనకపు సింహాసనం మీద శునకం వ్యాఖ్యను గుర్తు చేసి సాయిరెడ్డి అసలు ఓ రాజకీయ నేతే కాదని, ఆర్థిక నేరగాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పైనా తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్… దివంగత సీఎం వైఎస్సార్ ను తులనాడితే కూడా జగన్, ఆయన తల్లి విజయమ్మ స్పందించకపోవడం సరికాదన్నారు. వైఎస్సార్, ఎన్టీఆర్ వంటి నేతలపై అవాకులు చెవాకులు పేలితే పళ్లు రాలగొడతామంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.