కోర్టులో కేసు ఓడినవారు అక్కడే ఏడిస్తే, గెలిసిన వారు ఖర్చులు లెక్క చూసుకుని ఇంటికి వచ్చి ఏడ్చాడట. అలా తయారైంది కొందరి అధికార వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం దేవుడెరుగు కనీసం వారి సొంతపనులు కూడా కావడం లేదని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే డీఆర్సీ సమావేశంలో బోరున విలపించారట.
అసలేం జరిగింది బాసూ…
అతను ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే. అతనికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగుల ట్రీట్ మెంటుకు ప్రభుత్వం అడగ్గానే కాదనకుండా ఆ ఎమ్మెల్యేకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీ ఇచ్చాడట. కరోనా అదుపులోకి వస్తున్న సమయంలో ఇంజనీరింగ్ కాలేజీలో కరోనా సెంటర్ ఎత్తి వేశారు. త్వరలో క్లాసులు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే కాలేజీ తరగతి గదులు చూసిన ఎమ్మెల్యే అక్కడి అపరిశుభ్ర వాతావరణం చూసి షాకయ్యారట.
కాలేజీని సాధారణ స్థితికి తీసుకు వచ్చేలా పనులు చేయించాలని జిల్లా ఉన్నతాధికారులను ఎమ్మెల్యే వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందట. కోటి రూపాయలు ఖర్చు చేసినా తన కాలేజీ పూర్వ స్థితికి రాదని సదరు ఎమ్మెల్యే డీఆర్సీ సమావేశంలో భోరున విలపించారట. దీంతో అక్కడే ఉన్న ఇంఛార్జి మంత్రి, జిల్లా మంత్రి కలుగజేసుకుని వారించారట. కాలేజీ శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారట.
నాన్నా మనకు ఈ రాజకీయాలు వద్దు రాజీనామా చేసెయ్…
నాన్నా మన చెప్పులో రాయి మనం తీసుకోలేక పోతున్నాం. ఇక నియోజకవర్గ ప్రజలకు ఏం న్యాయం చేస్తాం. రాజీనామా చేసెయ్ నాన్నా అంటూ ఆ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు తండ్రిని వేడుకున్నాడట. పార్టీ అధికారంలోకి రావడానికి, తను గెలవడానికి కోట్లకు కోట్లు ఖర్చు చేసి, చివరకు కాలేజీని కూడా పాడు చేసుకుని ఈ రాజకీయాలు మనకెందుకు నాన్నా రాజీనామా చేసెయ్ అంటూ కొడుకు పోరు పెట్టడంతో ఆ వైసీపీ ఎమ్మెల్యే ఆలోచనలో పడ్డారట. ఏం జరుగుతుందో చూద్దాం.











