బెజవాడ దుర్గగుడి రథంపై వెండి ప్రతిమలు మాయం కేసు అటకెక్కినట్టే కనిపిస్తోంది. వెండి సింహాల ప్రతిమలు మాయం అయినట్టు గుర్తించి రెండు నెలలు అవుతున్నా, 16 మంది పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఒక్క క్లూ కూడా సాధించలేకపోయారు. అంటే దీని వెనక మంత్రి హస్తం ఉందని అందుకే పోలీసులు ఈ కేసులో ఏమీ తేల్చడం లేదని జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాంత్రిక పూజలు నిర్వహించేందుకే వెండి సింహాలను మాయం చేశారని జనసేన నేతలు విమర్శించినా కనీసం మంత్రి వెల్లంపల్లి స్పందించకపోవడం గమనార్హం.
బీహారీ కూలీలపైనే పోలీసుల ఫోకస్
దుర్గగుడి రథంపై వెండి ప్రతిమల దొంగతనం వ్యవహారం సెప్టెంబర్ 15వ తేదీ వెలుగు చూసింది. మహామండపం ప్రోటోకాల్ కార్యాలయం పక్కన రథం ఉన్నప్పుడే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో అమ్మవారి గుడిలో పదిహేను మంది బీహారీలు పలు నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. లాక్ డౌన్ లో మూడు దఫాలుగా జున్ మొదటి వారం నుంచి మూడో వారం వరకూ వారంతా బీహార్ వెళ్లిపోయారు. సింహాల మాయం వ్యవహారం వెలుగుచూడగానే పోలీసులు ముందుగా బీహారీలపై దృష్టి సారించారు. బీహారీలు తిరిగి వరంగల్ లో నిర్మాణ పనులు చేస్తున్నారని తెలసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి విచారించి వచ్చారు. అయినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఎవరినైనా విచారించవచ్చు కానీ, అసలు దొంగలను వదిలేసి, కేవలం బీహారీ కూలీలపైనే దృష్టి సారించడంపై ప్రతిపక్షనేత టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెండిసింహాలు
దుర్గగుడి వెండిసింహాల మాయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాత్ర ఉందని, అయితే పోలీసులు మాత్రం వారిని విచారించడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా దేవాదాయ శాఖ మంత్రి మాత్రం నోరుమెదపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దుర్గగుడికి కూతవేటు దూరంలో ఉన్న మంత్రిగారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తే వెండి సింహాలు వెలుగులోకి వస్తాయని బోండా చేస్తున్న విమర్శలకు పోలీసు అధికారులు కూడా స్పందించడం లేదు.
తెలిసినవారి పనేనా?
నిత్యం వేలాది మంది భక్తులు, వందలాది మంది సిబ్బంది ఉండే దుర్గగుడి ఆవరణలో ఉన్న రథంపై వెండిసింహాలను మాయం చేయడం వెనుక తెలిసినవారి హస్తం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. సీసీ టీవీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు దుర్గగుడి సిబ్బందిలో కొందరిని విచారించినా ఫలితం దక్కలేదు. రెండు నెలలు దర్యాప్తు చేసినా వెండి సింహాల ప్రతిమల దొంగతనం కేసులో ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో ఇక ఈ కేసు అటకెక్కినట్టేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.











