దసరా పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేవి మందు.. ముక్క. ఈ ఏడాది ధరలు చూస్తే దసరా పండుగ జోష్ లేకుండానే సాగిపోయేలా కనిపిస్తోంది.
పూటుగా తాగి పడుకుందాం అనుకుంటే మద్యం ధర చూస్తే రెట్టింపయింది. పోనీ ఆ కోరికను చంపుకొని కడుపునిండా ముక్కలైన కుమ్మేద్దాం అనుకుంటే.. వాటి ధరలు చుక్కలనం టుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా సినిమా హాల్లో ఎంటర్టైన్మెంట్ పొందే అవకాశం కనిపించటం లేదు. మరి ఈ దసరా చప్పగా సా…… గి పోవాల్సిందేనా..? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి.
చికెన్ కేజీ 250 రూపాయలు అయితే… మటన్ 850 కి చేరుకుంది. మద్యం ధరలు ఎలాగూ ప్రభుత్వం పెంచేసింది. పోనీ ఉన్నంతలో.. ఏ వెజ్ బిర్యానీయో చేసుకుని తిందామంటే.. ఉల్లిపాయలు, టమోటా రేట్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఈ గోలంతా ఎందుకు…. చక్కగా హైదరాబాదులో ఉన్న అత్తారింటికి వెళ్లి కూర్చుని తింటే పోలే… అనుకొని ఒకసారి బస్ టికెట్లు గురించి ఆరా తీస్తే… పర్సు మొత్తం వెతికినా రాను పోను ఖర్చులకి డబ్బులు కనిపించడం లేదు.
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో ఆర్టీసీ బస్సుల అంశం కొలిక్కి రాలేదు. ప్రైవేటు బస్సుల కోసం వేలకు వేలు తగలేసే కన్నా… ఉన్న ఊళ్లోనే ఏదో ఎగ్ బిర్యానీయో చేసుకొని పండగ కానిచ్చేయడం బెటర్ అన్న ఆలోచనకు మధ్యతరగతి కుటుంబీకులు అంతా వచ్చేశారు. ఇక మద్యం బాబులు విషయానికి వస్తే… అప్పో సప్పో చేసి… సెల్ ఫో నో.. వాచీయో తాకట్టుపెట్టి మత్తులో జోగిపోవడం ఖాయం.
మొత్తంగా కరోనా వైరస్ ఆర్థికంగా దెబ్బ కొడితే… ప్రభుత్వ వైఫల్యం కారణంగా ధరల నియంత్రణ లేక.. దసరా పండుగను సరదా లేకుండా చేసేశాయి.











