తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపక్షాలపై ప్రతి విమర్శలు చేయరాదని నిర్ణయించుకుంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై విలేఖరుల సమావేశాలు పెట్టి ఖండించడమో లేదా ప్రతి విమర్శలు చేయడమో కాకుండా విమర్శలు చేసిన వారికి నేరుగా సమాధానాలు చెప్పాలని నిర్ణయించింది.
అంటే ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఒక అంశం పై విమర్శలు చేస్తే వారికి సమాధానం చెప్పకుండా విమర్శలు చేసిన అంశాన్ని తాము ఎంత వరకూ నెరవేర్చామో కళ్లకు కట్టినట్టు చూపించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పై ప్రభుత్వాన్ని తీవ్ర స్దాయిలో విమర్శించారు. దీనికి సమాధానంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మల్లు భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి స్వయంగా తన కారులో విక్రమార్కను ఎక్కించుకుని జంట నగరాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాస్తవ పరిస్థితులను నేరుగా చూపించారు.
ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించింది, ఎంత మంది లబ్దిదారులకు ఇళ్లు అందించింది.. వంటి వివరాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యక్షంగా ప్రతిపక్ష నేతకు చూపించారు. దీంతో తాను చేసిన విమర్శలపై ఏ మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేత మిన్నకుండిపోయారు. ఇదే అదనుగా అధికార పార్టీ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ప్రశంస
ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యక్షంగా సమాధానం చెప్పడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రికి అభినందనలు తెలిపారు. త్వరలో జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల ముందు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రతిపక్ష నేతను ప్రత్యక్షంగా ఇరుకున పెట్టడం బాగుందని, ముందు ముందు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్ష నాయకులు ఎవరూ అడ్డదిడ్డంగా మాట్లాడరని.. ముఖ్యమంత్రి అన్నట్లు సమాచారం. భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలు చేసే విమర్శలపై పార్టీ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు ఇలాగే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు.
త్వరలో ‘బండి’ని తీసుకుని వెడతారు
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతి అంశం పైన ప్రభుత్వాన్ని తీవ్ర స్దాయిలో విమర్శిస్తున్నారు. జిల్లాల పర్యాటనలకు వెళ్లినప్పుడు కూడా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. ఇటీవల ఆయన పర్యటించిన వరంగల్, నిజామాబాద్, జంట నగరాలలో ప్రభుత్వంపై తీవ్ర స్దాయిలో విరుచుకుపడ్డారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏవీ అందడం లేదని విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన విమర్శలకు సమాధానంగా ఆయనను డబుల్ బెడ్రూమ్ ఇళ్లవద్దకు తీసుకుని వెళ్లాలని, అలాగే భగీరథ పనుల ప్రగతిని కూడా నేరుగా చూపించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా శాఖల మంత్రులను ఆదేశించినట్లు సమమాచారం. నాలుగైదు రోజులలో మంత్రులలో సీనియర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఇంటికి నేరుగా వెడతారని, ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు భగీరథ పనులు కూడా నేరుగా చూపిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఫలించే స్ట్రాటజీ
‘తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపుచెక్కతో నేనొకటంటా’ అన్నట్టుగా ఒకరి మీద ఒకరు విరుచుకుపడిపోవడం నాయకులకు అలవాటు. అయితే ఇదంతా మాటల వరకే. అంతకు మించి.. సవాళ్లను స్వీకరించడం, వాటికి జవాబును చేతల్లో చూపించడం అనేది సాధారణంగా జరగదు. కానీ.. తెలంగాణ రాష్ట్రసమితి అదే తమ వ్యహంగా ప్రస్తుతం మార్చుకుంది. కనీసం కొన్ని ఆరోపణల విషయంలో వారు ఇదే తీరుగా తమ పనిని విమర్శించిన వారికి చూపించి, నిరూపించినట్లయితే.. కొన్నాళ్లకు ప్రతిపక్షాల నోర్లు మూతపడతాయి. ఒకవేళ విమర్శలు చేసినా కూడా వాటికి ప్రజల్లో విలువలేకుండా పోతుందని అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.











