గత పదేళ్లుగా వైఎస్ఆర్ సీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ఐ ప్యాక్ సంస్థను జగన్ ఇక వదిలేశారు. గత ఎన్నికల ఫలితాలకు ముందే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలాగో ఓడిపోతామని ముందే గ్రహించిన జగన్ మోహన్ రెడ్డి.. ఫలితాలకు కొద్ది రోజుల ముందు ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి అందరికీ థ్యాంక్స్ చెప్పి.. బై బై చెప్పేశారు. అనుకున్నట్లుగానే వైసీపీ దారుణంగా, అవమానకరంగా ఓడిపోయింది. ఎందుకంటే ఇంకో ఐదేళ్లు అధికారంలో లేకుండా ఐ ప్యాక్ ను కొనసాగించాలంటే అది తలకు మించిన భారమే అవుతుంది. నిజానికి జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అదొక లెక్కే కాకపోయినప్పటికీ మొత్తానికి ఐ ప్యాక్ సేవలకు గుడ్ బై చెప్పేశారు.
ఎంతైనా ఐ ప్యాక్ ఉద్యోగులు చాలా ప్రొఫెషనల్స్. లేనిది ఉన్నట్లుగా.. ఫేక్ ప్రచారం చేయడంలో దిట్టలు. ఇప్పుడు ఆ ఐ ప్యాక్ లేని లోటు వైసీపీని తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు సజ్జల భార్గవ్ రెడ్డి వద్దే ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో ఆ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం ఎంత సొంపుగా ఉందో చూసి అందరూ నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడం ఒకరకంగా ఈజీనే. కానీ, ఇంకో రకంగా మాత్రం కష్టం. ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడా దొరక్కుండా పోస్టులు చేయాల్సి ఉంటుంది.
ఈ విషయంలో సజ్జల భార్గవ్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సజ్జల భార్గవ రెడ్డి అనంతపురంలో నిరుద్యోగుల భారీ ర్యాలీ అని ఓ వీడియో పెట్టి గొప్ప పని చేశానని అనుకున్నాడు. కానీ అది 4 నెలల కిందట వైసీపీ నిర్వాకంపై జరిగిన ర్యాలీ అని నెటిజన్లు వెంటనే కనిపెట్టేశారు. మళ్లీ విశాఖలోని మహాత్మగాంధీ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రభుత్వం అమ్మేసిందని ఫేక్ ప్రచారం చేశారు. విశాఖలో కింగ్ జార్జ్ ఆస్పత్రిని వైసీపీ సర్కార్ తాకట్టు పెట్టిందని అందరికీ తెలుసు. మరి ఈ మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎక్కడితో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ హాస్పిటల్ ఏంటో విశాఖ వాసులకు తెలుసు. అది ప్రైవేటు హాస్పిటల్. అసలు ఆ ఆస్పత్రికి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. మరి దాన్ని టీడీపీ ప్రభుత్వం ఎలా అమ్మేస్తుందో అన్న ఆలోచన చేయలేదు. అంత తేలివితేటలు లేకుండా సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఫేక్ ప్రచారం నడుస్తోంది.
మహాత్మ గాంధీ ఆస్పత్రిని అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన మరో ఆస్పత్రి గ్రూపు టేకోవర్ చేసింది. అది వారి ప్రైవేటు ఆస్తుల వ్యవహారం. కానీ టీడీపీ ప్రభుత్వం అమ్మేసిందని.. ఆ ఆస్పత్రి పూర్వాపరాలు తెలుసుకోకుండా వైసీపీ బ్యాచ్ ప్రచారం మొదలుపెట్టేసింది. దీంతో ఇక జగన్ ప్యాలెస్ లు అన్నింటినీ ప్రభుత్వం అమ్మేయొచ్చని టీడీపీ నేతలు సెటైర్లు మొదలుపెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని రకాల కుట్రల్లో నిపుణుడు అయితే.. ఆయన తనయుడు భార్గవ రెడ్డి అంత అమాయకుడేంటి? అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.











