వైసీపీ అధికారంలో ఉండగా విపరీతంగా రెచ్చిపోయిన ఎమ్మెల్యేల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ కూడా ఒకరు. పవన్ కల్యాణ్‌పై మరీ శ్రుతి మించి ఆయన ప్రవర్తించేవారు. పైగా వైసీపీ ఎమ్మెల్యేల్లో అత్యంత అవినీతి పరుడు ఎవరంటే ఆ పార్టీ వర్గాలే ద్వారంపూడి పేరు చెబుతారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే అయిన ఈయన వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉండేవారు. పైగా పవన్ కల్యాణ్ పై అధికార మదంతో విపరీతంగా చెలరేగిపోయేవారు.
కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాక, కాకినాడలో ద్వారంపూడి కూడా ఓడిపోయారు. ఇప్పుడు ద్వారంపూడికి అసలైన ట్రీట్మెంట్ మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలే కాక.. వ్యక్తిత్వ హననం లక్ష్యంగా దుర్భాషలాడటంలోనూ ద్వారంపూడి అన్ని హద్దులూ దాటేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ నుంచి పోటీలో దిగినా పవన్ కల్యాణ్ ను ఓడించి తీరుతానని శపథాలు చేశారు. అయితే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ద్వారంపూడి ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా తరలించి రూ.కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాము అధికారంలోకి రాగానే ఆ అవినీతి సంపాదనను వెలికి తీసి కక్కిస్తామని పవన్ కూడా అప్పుడు సవాల్ చేశారు.
కట్ చేస్తే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవలే కాకినాడ కలెక్టర్ ఆఫీసులో అధికారులతో పౌరసరఫరాల శాఖపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారని సమాచారం. గతంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా తరలించారని విమర్శించారు. అయితే, పౌర సరఫరాల విషయంలో అన్ని రకాల అవినీతిని అరికట్టాలని చెప్పిన నాదెండ్ల మనోహర్ అధికారులను హెచ్చరించారు. ద్వారంపూడి అవినీతిని ప్రస్తావించే క్రమంలో నాదెండ్ల అధికారులకు కూడా గట్టి హెచ్చరికలు చేశారు.
అయితే, రెండు రోజుల పాటు కాకినాడలో పర్యటించిన నాదెండ్ల మనోహర్ ముఖ్యంగా ద్వారంపూడికి సంబంధించి నివేదికలను రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇంకా త్వరలో పవన్ కల్యాణ్ కూడా తన నియోజకవర్గం పిఠాపురంతో పాటు, కాకినాడలోనూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ద్వారంపూడికి భయం పట్టుకుంది. అప్పట్లో అవినీతికి మారుపేరుగా వ్యవహరించిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అవినీతిని మరింతగా వెలుగులోకి తెచ్చి ఆయనను చట్టం ప్రకారం శిక్షించే ఆపరేషన్ పవన్ పర్యటన తర్వాత మొదలవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు