వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇంచార్జీ సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో పెను చర్చనీయాంశంగా మారిన సోషల్ మీడియా వికృత పోస్టుల వ్యవహారంలో సజ్జల జూనియర్ పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బార్గవరెడ్డి వ్యూహాత్మకంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసుల్లో మరో నిందితుడిగా ఉన్న జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డితో కలిసి భార్గవరెడ్డి సోమవారం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తనపై నమోదైన కేసులో బీఎన్ఎస్ చట్టం వర్తించదని భార్గవ రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టు… ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరణ కోరింది. దీంతో సదరు వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటిదాకా భార్గవరెడ్డిని అరెస్ట్ చేయరాదని కోర్టు నుంచి ఆదేశాలు అయితే జారీ కాలేదు. దీంతో భార్గవరెడ్డికి షాక్ తగిలినట్టైంది.
వాస్తవానికి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన గుడివాడలో నమోదైన కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకే భార్గవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పులివెందులలో టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భార్గవరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అట్రాసిటీ కేసులన్నీ నాన్ బెయిలబుల్ కేసులే. ఈ కేసుల్లో నిందితులకు బెయిల్ గానీ, ముందస్తు బెయిల్ గానీ లబించదు. ఈ నేపథ్యంలో భార్గవరెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు కాగానే… ఆయన దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు… ఆయనతో పాటు అర్జున్ రెడ్డి, మరో ఇద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం భార్గవరెడ్డి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో వైఎస్ భారతి రెడ్డి పీఏ వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసుల విచారణలో సజ్జల భార్గవ రెడ్డి ఆదేశాల మేరకే తాను అసభ్య పోస్టులను పెట్టినట్లు వర్రా ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఈ దిశగా వచ్చిన వర్రా స్టేట్ మెంట్ ను ఆధారం చేసుకున్న పోలీసులు భార్గవ రెడ్డే…సోషల్ మీడియా వికృత పోస్టులకు మూల కారణమని ఓ అంచనాకు వచ్చారు. అంతేకాకుండా వరుసగా అరెస్ట్ అవుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా భార్గవ రెడ్డే కర్త, కర్మ, క్రియ అని చెప్పినట్లుగా సమాచారం. దీంతో సజ్జల జూనియర్ పై పోలీసులు మరింతగా నిఘా పెంచారు. ఓ వైపె కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, మరోవైపు అట్రాసిటీ కేసు, అరెస్టైన వారంతా సజ్జల పేరే చెబుతుండటంతో ఏ క్షణమైనా ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.