వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇకపై దినదినగండమేనని చెప్పక తప్పదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలపై జగన్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అక్రమాస్తుల కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసుల్లో అరెస్టైన జగన్ 16 నెలల పాటు చంచల్ గూడ జైలులో విచారణ ఖైదీగా కాలం వెళ్లదీసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న జగన్… పదేళ్లకు పైగా ఆ బెయిల్ పైనే బయట తిరుగుతున్నారు. అయితే జగన్ పార్టీ టికెట్ పైనే నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు… జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతీ తెలిసిందే. అంతేకాకుండా జగన్ అక్రమాస్తుల కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, అప్పుడే ఈ కేసులు త్వరగా ముగింపునకు వస్తాయని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ రెండు పిటిషన్లు మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. అయితే ఈ బెంచ్ లో న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ సంజయ్ కుమార్… నాట్ బిఫోర్ మి అంటూ జగన్ కేసులను విచారించేందుకు నిరాకరించారు. గతంలో ఇలానే ఈ పిటిషన్లు తన ముందుకు వచ్చినప్పుడే తాను నాట్ బిఫోర్ మి అని చెప్పానని కూడా ఆయన తెలిపారు. దీంతో వెంటనే ప్రతిస్పందించిన సీజేఐ జస్టిస్ ఖన్నా… ఈ పిటిషన్లను డిసెంబర్ 2కు వాయిదా వేస్తున్నామని, ఆ రోజు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం వీటిని విచారిస్తుంది తెలిపారు. జస్టిస్ సంజయ్ కుమార్ గతంలోనే నాట్ బిఫోర్ మి అని చెప్పినా… పొరపాటున తిరిగి ఇదే బెంచ్ కు ఆ పిటిషన్లు వచ్చాయని జస్టిస్ ఖన్నా తెలిపారు.
మొత్తంగా సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రఘురామ పిటిషన్లు వచ్చిన తీరు చూస్తుంటే… జగన్ బెయిల్ రద్దు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపించాయి. ఎందుకంటే… రాజకీయ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులను సుదీర్ఘకాలం పాటు పెండింగ్ లో ఉంచరాదని గతంలోనే సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులు చెప్పింది. అంతేకాకుండా జగన్ కేసును ఇకపై మరింతగా సాగదీయవద్దని, వీలయినంత త్వరగా ఈ కేసుకు ముగింపు పలకాలని కూడా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావడం, అది కూడా నేరుగా సీజేఐ జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ముందుకు రావడంతో జగన్ తో పాటు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి. అయితే జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మి అనడంతో జగన్ ఈ సారికి బతికి బట్టకట్టారని, డిసెంబర్ 2న మాత్రం తప్పించుకోలేరన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.