దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్, కొత్తమ్మాయి శ్రీలీల జంటగా నటించిన ప్రేమకథాచిత్రం ‘పెళ్ళిసందD’. ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మ్యూజికల్ మ్యాజిక్ చేసిన పెళ్ళిసందడి చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.
ఇప్పటి జెనరేషన్ ప్రేక్షకులకు అలనాటి అనుభూతిని తిరిగి ఇవ్వడానికి రాఘవేంద్రరావు ఈ సినిమాను తన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రేమంటే ఏంటి? అనే పాటను మొన్నామధ్య విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. నేడు రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని రెండో సింగ్ ల్ ను విడదుల చేశారు. బుజ్జులు బుజ్జులు అంటూ సాగే.. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. బాబా సెహగల్, మంగ్లీ గానం చేశారు.
బుజ్జులు బుజ్జులు బుజ్జులు .. కొనిపెడతా బంగారు గజ్జెలు..తినిపిస్తా తీయని ముంజులు అంటూ జానపద తరహాలో సాగే ఈ పాటలో రోషన్, శ్రీలీల ఇద్దరూ దానికితగ్గట్టుగానే వేషధారణతో మెప్పించారు. ఈ పాట పిక్చరైజేషన్ లో ఒకప్పటి రాఘవేంద్రరావు స్టైల్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడా పాలు కావాలా అనే పాటను మరోసారి గుర్తుకు తెస్తోంది ఈ సాంగ్. ప్రస్తుతం ఈ పాటకు కూడా మంచి స్పందన లభిస్తోంది.











