రాజకీయ నేతలపై పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక కోర్టుల్లో ప్రతి రోజూ విచారించి వెంటనే తేల్చాలని ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశించి నెల రోజులవుతోంది. ఇప్పటికే రాజకీయ నేతల అవినీతి, క్రిమినల్ కేసులు తేల్చేందుకు ప్రత్యేక కోర్టుల్లో ప్రతి రోజూ విచారణలు జరుగుతున్నాయి. ఇక త్వరలో దేశంలోని రాజకీయ నేతల అవినీతిపై తుది తీర్పులు వస్తాయని అందరూ భావించారు. అంతలోనే బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి దిలీప్ రేకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆహా మన దేశంలో రాజకీయ నాయకులపై అవినీతిని తేల్చేస్తున్నారు అనుకునే లోగానే ఢిల్లీ హైకోర్టు ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఆ అవినీతి మంత్రికి బెయిల్ కూడా మంజూరు చేసింది.
ఏళ్ల తరబడి విచారణ
దేశంలో రాజకీయ నాయకుల అవినీతి, నేరాలపై 4918 కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి విచారణలో ఉన్నాయి. కొన్ని కేసులయితే ఏకంగా మూడు దశాబ్దాల నుంచి విచారణలోనే ఉన్నాయి. కొన్ని కేసుల్లో ముద్దాయిలు మరణించినా ఆ తీర్పులు ఇంకా రాలేదు. అంటే మన దేశంలో అనేక రంగాల్లో సంస్కణలు వచ్చినా, న్యాయ వ్యవస్థలో మాత్రం పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఎవరికైనా అన్యాయం జరిగిందని కోర్టుకు వెళితే ఇక ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు తెగుతుందో చెప్పలేం. అవతలి వ్యక్తి బాగా డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తి అయితే ఇక ఆ కేసుల్లో కింద నుంచి సుప్రీంకోర్టు వరకూ దశాబ్ధాల తరబడి విచారణలు కొనసాగుతూనే ఉంటాయి.
బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి కంపు
1998లో అప్పటి కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రిగా పనిచేసిన దిలీప్ రేపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అతనిపై కేసు నమోదైంది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అవినీతిని తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో రెండు దశాబ్దాలుగా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ముద్దాయిలు కొందరు చనిపోయారు కూడా. తాజాగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అప్పటి బొగ్గు గనుల మంత్రి అవినీతికి పాల్పడ్డారని తేల్చింది. మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వెంటనే మాజీ మంత్రిగారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇవన్నీ గమనిస్తూ ఉంటే సదరు మంత్రి బతికుండగా కేసు తుది తీర్పునకు నోచుకుంటుందా అనే అనుమానం రాక మానదు.
ఏపీ సీఎంపై ఉన్న కేసులు కూడా ఇంతేనా
ఏపీ సీఎంపై 11 కేసులు ప్రత్యేక సీబీఐ న్యాయస్ధానంలో విచారణలో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోజు వారీ విచారణ ప్రారంభం అయింది. త్వరలో కేసులపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేసులోనూ నిందుతులు పైకోర్టుకు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇక ఆయా కోర్టుల్లో ఈ కేసులపై రోజువారీ విచారణ జరుగుతుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. మున్సిఫ్‌కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఒక్కో కోర్టులో ఒక్కో కేసును పదేళ్లు నానబెడితే ఇక కేసులో తుది తీర్పు వచ్చే లోగా నిందితులు ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
తీవ్ర జాప్యంతో బాధితులకు అన్యాయం చేసినట్టే
కేవలం రాజకీయ నాయకులపైనే కాదు అనేక కేసులు దశాబ్దాల తరబడి కోర్టుల్లో నానుతూనే ఉన్నాయి. అసలు కొన్ని కేసులైతే విచారణకు కూడా నోచుకోవడం లేదు. బాధితులకు సత్వరం న్యాయం చేయలేకపోవడం అంటే వారికి అన్యాయం చేసినట్టేనని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే దేశంలో పెండింగ్ లో ఉన్న 87 లక్షల కేసులు సకాలంలో తేల్చేందుకు సుప్రీంకోర్టు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోర్టుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు, కేసును బట్టి దానిపై ఎంత కాలంలో తీర్పు వెలువరించాలనే నిబంధన కూడా విధించాలి. ప్రతి కేసును ఆయా కోర్టులు సంవత్సరంలో తేల్చగలిగితే మొత్తం కేసులపై నాలుగేళ్లలో తుది తీర్పులు వస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో కోర్టులో సంవత్సరం మించి కేసు నడవడానికి వీల్లేదనే నిబంధన విధిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందంటన్న మేధావులతో ఏకీభవించాల్సిందే.