వైఎస్ ఫ్యామిలీ – నారా ఫ్యామిలీ రాజకీయంగా ఎంతటి ప్రత్యర్థులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత శత్రుత్వంగా జగన్మోహన్ రెడ్డి మార్చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల చేసిన పని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిల నారా లోకేశ్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. అందులో వైఎస్ షర్మిల పంపినట్లుగా ఓ గ్రీటింగ్ కార్డు కూడా ఉంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ లోకేశ్ కు షర్మిల ఆ గిఫ్ట్ పంపారు. దీన్ని అందుకున్న నారా లోకేశ్ ఓ ట్వీట్ కూడా చేశారు. ‘‘డియర్ షర్మిల గారు. ఈ క్రిస్మస్ గిఫ్ట్ ను పంపినందుకు నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నారా ఫ్యామిలీ నుంచి మీ కుటుంబానికి క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము’’ అని ట్వీట్ చేశారు.
ఏపీ రాజకీయాల్లో ఇది కనీసం ఊహించని పరిణామంగా అంతా చూస్తున్నారు. అయితే, వైఎస్ షర్మిల ఇలా వ్యవహరించడం.. వైఎస్ జగన్‌ను ఇరుకున పెట్టేందుకే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ సొంత చెల్లెలు అయిన షర్మిల.. లోకేశ్‌కు క్రిస్మస్ గిఫ్టు పంపడంతో జగన్ కు దిమ్మతిరిగిపోయింది. అన్న జగన్‌తో షర్మిలకు చాలాకాలంగా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి విషయంలో అన్యాయం చేసిన జగన్ తన చెల్లెల్ని తరిమేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే షర్మిల తెలంగాణకు వెళ్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు. ఇడుపులపాయలో తండ్రి సమాధికి నివాళులు అర్పించే సమయంలో కూడా జగన్, షర్మిల ముఖముఖాలు చూసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడామె లోకేశ్‌ను సోదరుడిగా భావించి క్రిస్మస్ బహుమతులు పంపడం.. ఆయన కూడా సానుకూలంగా స్పందించడంలో రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయనడానికి నిదర్శనంగా మారింది.
అదీకాక ఇటీవల జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కూడా షర్మిల శుభాకాంక్షలు తెలపలేదు. చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినప్పటికీ.. అటు లోకేశ్ కూడా విషెస్ చెప్పలేదు. రాఖీ పండక్కి కూడా జగన్ కు రాఖీ కట్టడం షర్మిల ఎప్పుడో మానేశారు. అటు సాక్షిని కూడా పరోక్షంగా విమర్శిస్తూనే వస్తున్నారు. ఈ స్థాయిలో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఉన్నాయి. అటు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా జగన్ ను వదిలేసి.. వైఎస్ షర్మిల దగ్గరే ఉంటోంది. అధికారంలోకి వచ్చాక జగన్ నిర్ణయాలు, అహంకారపూరిత వ్యవహార శైలి నచ్చకే తల్లి విజయమ్మ కూడా కుమారుడు జగన్ కు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ తన ఆస్తి, అధికారం కోసం తల్లిని, చెల్లిని తరిమికొట్టాడనే అపవాదును కూడా మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.
షర్మిల త్వరలోనే ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం బాగా జరుగుతోంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. అదే జరిగితే సొంత చెల్లెలు.. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే.. ఏపీ ప్రజల ముందు జగన్ పరువు పోయినట్లే అవుతుంది. ఆ ఊహాగానాల నేపథ్యంలో షర్మిల లోకేశ్ పంపిన గిఫ్ట్ పంపారు. ఇలా ఎవరూ ఊహించని రీతిలో షర్మిల ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఇది తన అన్నకు బుద్ధి చెప్పడానికే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.











