ప్రముఖ పొలిటికల్ స్ట్రేటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తాను నెలకొల్పిన ఐ-ప్యాక్ సంస్థ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ఐ ప్యాక్ సంస్థ అధికార వైసీపీ కోసం పని చేస్తుండగా.. ప్రశాంత్ కిషోర్ మాత్రం దాని నుంచి బయటికి వచ్చి చంద్రబాబుతో చేతులు కలిపారు. గత 2017 ఏడాది నుంచి ఏడేళ్లుగా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్ జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తూ వచ్చింది. తాజాగా ప్రశాంత్ కిషోర్ బయటికి వెళ్లిపోయి చంద్రబాబుకు పని చేయడం వైసీపీ క్యాడర్ కు మింగుడు పడడం లేదు. అయితే, జగన్మోహన్ రెడ్డి మూలంగానే ఐ ప్యాక్ సంస్థ మునిగిపోయిందనే వాదన ఒకటి తెరపైకి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే జగన్ ఐ ప్యాక్ ను పడగొట్టి తన అనుచరుల హస్తగతం చేసుకొనేలా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఐ ప్యాక్ సంస్థలో ప్రశాంత్ కిషోర్ కు 22 శాతం వాటా ఉంది. ఈయన కాక మరో ముగ్గురు రిషి రాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేశ్ చందేల్ అనే వారు ఐ ప్యాక్ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ లో తనకున్న వాటా 22 శాతం వాటాను తీసుకొని వైదొలిగినట్లుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఐ ప్యాక్ సంస్థ అధికారిక వెబ్ సైట్ లో కూడా కనీసం ప్రశాంత్ కిషోర్ పేరు ఎక్కడా లేదు. డైరెక్టర్లుగా ముగ్గురు ఉన్నప్పటికీ ముఖ్యంగా రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి చేతుల్లో సంస్థ నడుస్తున్నట్లు టాక్. ఇప్పుడు ఈయన ఆఫీసు తాడేపల్లిలోనే పెట్టుకొని.. జగన్ కోసం పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
అయితే, జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఐ ప్యాక్ సంస్థ మొత్తాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నట్లుగా ప్రచారంలో ఉంది. తన నమ్మకస్తుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఐ ప్యాక్ లోని వాటాలు కొనుగోలు చేయించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఐ ప్యాక్ సంస్థ చెవిరెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తన తెలివితేటలతో, తన వ్యూహాలతో ఈ స్థాయికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి.. తనకే వెన్నుపోటు పొడవడంపై ప్రశాంత్ కిషోర్ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. 2019లో జగన్ 150 సీట్ల కనీవినీ ఎరుగని మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టారంటే.. అందుకు కారణం ప్రశాంత్ కిషోర్ మాత్రమే. ఆయన రూపొందించిన సంక్షేమ పథకాలు, సామాజిక వర్గాల వారీగా పార్టీ ప్రజల్లోకి వెళ్లిన విధానం, నవరత్నాలు లాంటివన్నీ ప్రశాంత్ కిషోర్ మెదడులో నుంచి వచ్చినవే. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారనే వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చేతులు కలపడంతో జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నారు. తనపై కక్ష్యతో తనను ముంచేలా ప్రశాంత్ కిషోర్ ఏ వ్యూహాలు రూపొందిస్తారో, చంద్రబాబుతో కలిసి ఏ కుట్రలు చేస్తారో అని జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.