టిఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ కార్పొరేటర్లకు సర్వే భయం వెంటాడుతోంది. వారి పనితీరుపై అంతర్గతంగా టిఆర్ఎస్ అధినాయకత్వం సర్వే చేయిస్తుండటంతో కార్పొరేటర్లకి ఒకింత భయం వెంటాడుతోంది. కార్పొరేటర్ల పనితీరుపై ఆయా డివిజన్‌స్థాయిల్లో తెరాస గతంలో సర్వే చేయించింది. కానీ మరోకసారీ కూడా కార్పొరేటర్ల పనితీరుపై అంతర్గతంగా సర్వేచేయించి ఆ తరువాత గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని తెరాస భావిస్తుందని తెలిసింది. ఈ సర్వే బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. అక్టోబర్ 10 వరకల్లా సర్వేకు సంబంధించిన నివేదికను పార్టీకి అందజేయాలని హుకూం కూడా జారీ చేశారని తెలిసింది. ఈ క్రమంలో ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు వస్తాయో.. రావో.. అని సర్వే గురించి కార్పొరేటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే చర్చ జరుగుతోంది.
క్లీన్ చిట్ ఉండాల్సిందే..
వివాదాలు, అవినీతికి దూరంగా ఉండేవారికే మరోసారి ఛాన్స్ ఇచ్చే విషయంపై పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వాలంటే అభ్యర్థులకు క్లీన్ చిట్ ఉండాల్సిందేనని అంటున్నారట. 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని ఇప్పటికే అధిష్టానం దృష్టి కి వెళ్లింది. గతంలో కొందరు కార్పొరేటర్లపై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పార్కింగ్ విషయంలో గొడవపడి, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, చేయిచేసుకున్న శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలైనట్లు కూడా తెలిసింది.
అలాగే కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్‌మెట్ డివిజన్‌లో ఓ నిర్మాణదారుడి నుంచి ఒక కార్పొరేటర్ లంచం తీసుకున్న సంభాషణ కలకలం రేపింది. ఆ మహిళా కార్పొరేటర్ రూ.20 వేలు తీసుకున్నట్లు, ఇతర నిర్మాణదారులను కూడా డబ్బులు అడిగినట్లు స్వయంగా తన భర్తకే ఫోన్‌లో చెప్పిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఒకరిద్దరే కాదు గ్రేటర్ లోని మరికొందరు కార్పొరేటర్లు పలురకాల ఆరోపణలను ఎదుర్కున్నవారూ ఉన్నారు. అయితే కార్పొరేటర్ల పనితీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో? అని తెలుసుకుని, వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకునే కార్పొరేటర్లకే మరోసారి అవకాశం ఇచ్చే అంశంపై పార్టీ సర్వేచేయిస్తుంది.
సెంచరీ కోసమే ఈ సర్వేనా?..
గతంలో మాదిరిగానే గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు గెలిచేందుకే ఈ సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ అభ్యర్థి ఎలాంటి వారో తెలియకుండా టిక్కెట్లు ఇస్తే ఓటమి తప్పదనుకొని తెరాస అంతర్గతంగా సర్వే చేయిస్తోంది. మంచి ఇమేజ్ ఉన్న అభ్యర్థులకు టికెట్ ఇస్తే గ్రేటర్ ఎన్నికల్లో ఈజీగా సెంచరీ కొట్టొచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోందట. అభ్యర్థుల వడపోతకు మరింతగా లోతుగా సర్వే చేయించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో సీనియర్ నేతకు గ్రేటర్ పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. వీరంతా అక్టోబరు 10 లోపు కార్పొరేటర్ల పనితీరుపై పార్టీకి నివేదికలు అందజేస్తారని సమాచారం. ఈ రిపోర్ట్‌ల ఆధారంగా ఎవరికి టికెట్ ఇవ్వాలో.. ఎవరికి ఉద్వాసన పలకాలో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే కొందరు కార్పొరేటర్లకు తమగురించి ఎలాంటి రిపోర్టులు పోతాయోనని మదనపడుతున్నట్లు సమాచారం.











