సల్మాన్ ఖాన్.. పరిచయం అవసరం లేని స్టార్ హీరో. ఆయన సినిమా వచ్చిందంటేనే అభిమానులకు పండగ. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే వసూళ్ల పరంగా షేక్ అవుతుంది. అలాంటి సల్మాన్ ఖాన్ వెబ్ సీరీస్ నిర్మాణం చేబట్టాలని నిర్ణయించుకున్నాడు. దేశంలో వెలుగులోకి రాకుండా మరుగునపడిన గ్రామీణ క్రీడలను వీటి ద్వారా అందరికీ తెలియజెప్పాలని, ఆయా క్రీడల్లో రాణించి సరిగా ప్రచారానికి నోచుకోని క్రీడాకారులకు వీటి ద్వారా ప్రాచుర్యం కల్పించాలని సల్మాన్ భావిస్తున్నాడట.
ఇటీవల లాక్ డౌన్ సందర్భంగా దొరికిన ఖాళీ సమయంలో వీటి గురించి ప్రణాళికలు రూపొందించుకున్నాడని అంటున్నారు ఆయన సన్నిహితులు. వీటికి సంబంధించిన పరిశోధన, స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ వెబ్ సీరీస్ నిర్మాణం మొదలవుతుందని సమాచారం. దీంతో మరికొంత మంది బాలీవుడ్ హీరోలు కూడా ఈ విషయంలో సల్మాన్ ని అనుసరించవచ్చని భావిస్తున్నారు.